రిలీజ్‌ కాకముందే రీమేక్‌ చేద్దామన్నారు!

16 Sep, 2018 01:28 IST|Sakshi
పవన్‌ కుమార్‌

సమంత ముఖ్య పాత్రలో పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్‌’. కన్నడ ‘యు టర్న్‌’కి ఇది రీమేక్‌. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌ పలు విశేషాలు పంచుకున్నారు.


► బెంగళూర్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్‌ మీద యు టర్న్‌ని పట్టించుకోం. రాంగ్‌ రూట్‌లో వెళ్లిపోతుంటాం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ.

► ఈ సినిమాను నేను రీమేక్‌ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం. కన్నడంలో తీసినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్‌. బడ్జెట్, ఇంకా చాలా విషయాల్లో అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి వీలుపడలేదు. ఈసారి బాగా తీశాను.

► కన్నడ ‘యు టర్న్‌’ ట్రైలర్‌ రిలీజైన సాయంత్రమే సమంత నాకు మెసేజ్‌ చేసింది. తర్వాత స్క్రిప్ట్‌ పంపించమంది. నాకు భయమేసింది. సినిమా రిలీజ్‌ అవ్వకుండా స్క్రిప్ట్‌ ఎలా పంపుతాం? అని. పంపాను. సమంత, చైతన్య వచ్చి నా ఆఫీస్‌లోనే రిలీజ్‌ కాకముందే సినిమా చూశారు. బాగా నచ్చింది. రీమేక్‌ చేస్తాం అన్నారు.

► ఏదైనా భాషలో హిట్‌ అయిన సినిమాను మరో భాషలో రీమేక్‌ చేస్తుంటాం. కానీ రిలీజ్‌ కాకముందే సమంత రీమేక్‌ చేయాలనుకోవడం గ్రేట్‌. తనకున్న కమిట్‌మెంట్స్‌ వల్ల సినిమా స్టార్ట్‌ చేయడం ఆలస్యం అయింది. సమంత, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాం. సో.. సెట్లో డైరెక్టర్‌–యాక్టర్‌ ఈక్వేషన్‌ కంటే కూడా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్లం.

► నా ఫస్ట్‌ సినిమా ‘లూసియా’ను హిందీలో రీమేక్‌ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. నెక్ట్‌ ఏ ప్రాజెక్ట్‌ అని ఇంకా నిర్ణయించుకోలేదు.

మరిన్ని వార్తలు