‘నాకు బిడ్డ కావాలి.. భర్త కాదు’

15 Jul, 2020 19:04 IST|Sakshi

శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌ ట్రైలర్‌ విడుదల

బాలీవుడ్‌ స్టార్‌ విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌’. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అనూ మీనన్‌ దర్శకత్వం వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడిన నేపథ్యంలో ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతలా దేవి బాల్యం, హ్యూమన్‌ కంప్యూటర్‌గా ఆమె ఎదిగిన క్రమంలో ఎదురైన అనుభవాలు.. ముఖ్యంగా గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించినప్పటికీ తన కూతురి చేత మంచి తల్లి అనిపించుకోలేకపోయిన సంఘటనలను స్పృశిస్తూ ట్రైలర్‌ సాగింది.(కథ వింటారా?)

ముఖ్యంగా శకుంతలా దేవి వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియని అనేక విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఆడపిల్లలపై వివక్ష గురించి మాట్లాడే శకుంతలా దేవి.. ‘‘నాకు ఓ బిడ్డ కావాలి. కానీ భర్త కాదు’’ అంటూ కొంటెగా సమాధానం చెప్పడం.. కూతురు పుట్టిన తర్వాత భర్తకు దూరం కావడం, ఈ క్రమంలో గణితశాస్త్రమే సర్వస్వంగా బతికే తల్లిపై ఆమె కూతురు ద్వేషం పెంచుకోవడం వంటి భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తించింది. తల్లి నుంచి దూరమైన కూతురు ఆమెపై న్యాయపోరాటానికి సిద్ధం కావడం, ‘‘నేనెప్పుడూ ఓడిపోను. అది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి’’ అని శకుంతలా దేవి సమాధానం చెప్పడం వంటి సీన్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన విద్యాబాలన్‌ శకుంతలా దేవి పాత్రలో మరోసారి తనదైన నటనతో అందరి మనసులు దోచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 31న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా