ఇది మరచిపోలేని యాత్ర

1 Nov, 2018 02:45 IST|Sakshi
మమ్ముట్టి, మహీ.వి. రాఘవ్‌

ఇటీవలే ‘యాత్ర’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహా నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి  పాత్రను పోషించారు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ జర్నీలో మమ్ముట్టితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని దర్శకుడు మహీ. వి రాఘవ్‌ ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘మమ్ముట్టిగారితో మా ప్రయాణం ముగిసింది. 390కి పైగా సినిమాలు, 3 నేషనల్‌ అవార్డులు, 60మందికి పైగా నూతన దర్శకులను పరిచయం చేసిన వ్యక్తి మమ్ముట్టిగారు.

ఇవన్నీ కాకుండా చాలా గొప్ప మనిషి, మంచి గురువు. ఇన్ని చేసిన ఆయన ఇంకా నిరూపించుకోవాల్సింది, సాధించాల్సింది ఏమీ లేదు. బంధువును గౌరవించుకోవడం మన సంప్రదాయం అంటారు. ఏదైనా సినిమాలో తన పాత్రను సరిగ్గా నిర్వర్తించకపోయినా, మీ అంచనాలను అందుకోకపోయినా ప్రేక్షకులుగా మీరు ఆయన్ను విమర్శించవచ్చు. కానీ, నటుడిగా ఆయనకున్న డెడికేషన్‌ అభినందించకుండా ఉండలేనిది. ఈ స్క్రిప్ట్‌ని తెలుగులోనే విన్నారు. ప్రతి అక్షరానికీ అర్థం తెలుసుకున్నారు.

ప్రతి డైలాగ్‌ని ఆయన భాషలో రాసుకొని క్షుణ్ణంగా సెట్లో పలికారు. డబ్బింగ్‌లో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తపడ్డారు. ఆయనకు మన సంప్రదాయాలు, సంస్కృతి మీద విపరీతమైన గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. ఈ క్యారెక్టర్‌కు మమ్ముట్టిగారు తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా చెప్పగలను. మమ్ముట్టిగారు నిజంగా మ్యాజిక్, వండర్‌ఫుల్‌. ఆయనతో చేసిన ఈ యాత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ అన్నారు. ‘యాత్ర’ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు