‘భజన బ్యాచ్‌’తో వస్తోన్న యప్‌టీవీ

1 Oct, 2019 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకుని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్‌లైన్‌ వేదిక యప్‌ టీవీ తాజాగా వెబ్‌ సిరీస్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇది సొంతంగా సీరియల్స్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భజన బ్యాచ్‌ పేరుతో.. వెబ్‌ సిరీస్‌ని నిర్మిస్తున్నట్లు యప్‌ టీవీ యాజమాన్యం తెలిపింది. దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న వాసుదేవ రెడ్డి (ఐడ్రీమ్), యప్‌టీవీ స్టూడియోలు సంయుక్తంగా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యప్‌ టీవీ యాజమాన్యం మాట్లాడుతూ.. 12 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి, గెటప్‌ శ్రీను, జెమిని సురేష్‌, దీప నాయుడు, జోగి కృష్ణరాజు, షకలక శంకర్, బుల్లెట్ భాస్కర్, గణపతి, గోవింద్, సుధాకర్ రాఘవ, అప్పారావ్ వంటి ప్రముఖ హస్యనటులు నటిస్తున్నారని తెలిపారు. భజన బ్యాచ్‌ అనేది కామిక్‌ వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కనున్నట్లు తెలిపారు. భజనలే బతుకుతెరువుగా బండి లాగిస్తున్న ఓ వ్యక్తి వారసత్వంగా తన పిల్లలకు కూడా భజనలు నేర్పుతాడు. అయితే ఇది వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది.. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఏర్పడిన పరిణామాలు వంటి అంశాలతో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. పంచ్‌లు, కామెడీ సన్నివేశాలు, ఆసక్తికర ట్విస్ట్‌లతో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా యప్‌ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్‌ నందన్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఉత్తమమైన ప్రాంతీయ అంశాలను అందించడమే మా ప్రధాన ధ్యేయం. ఈ క్రమంలో మేము మరో గొప్ప సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాము’ అని తెలిపారు. అంతేకాక ‘భజన బ్యాచ్’ అనేది ప్రధానంగా యువతనే కాక అన్ని వయసుల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు ఉదయ్‌ నందన్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా