నిధులున్నా.. నిర్లక్ష్యమే! 

19 Feb, 2018 16:43 IST|Sakshi
అప్పిరెడ్డిపల్లిలో వంట చేస్తున్న మహిళ (ఫైల్‌)  

ప్రారంభంకాని వంటగది నిర్మాణం  

నారాయణపేట రూరల్‌ : దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వలేదన్న చందంగా తయారైంది పాఠశాల వంటగది పరిస్థితి. ఒక పక్క సౌకర్యాల కల్పనకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం అనుమతి వచ్చి డబ్బులు మంజూరైనా పనులు చేపట్టడంలేదు. స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసి ఏడు నెలలు కావొస్తున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉంది. మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా ఉన్న ఎంపీపీ మణెమ్మ స్వగ్రామం అప్పిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 8వ తరగతి వరకు 170మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజనం వండటానికి ప్రత్యేక గదిలేక ఆరుబయటనే ఏజెన్సీ నిర్వహకులు వంటలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దష్టికి తీసుకుని వెళ్లగా గది నిర్మాణానికి రూ.2లక్షల నిధులు మంజూరు చేయించి హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పనులు మొదులు కాలేదు. అక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష నాయకులు మేమంటే మేము యేస్తాం అంటూ పోటీ పడటంతో పనులు ప్రారంభం కానట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి బంధువు, ఎంపీపీ భర్త, ఎస్‌ఎంసీ చైర్మన్‌ల మధ్య ఏర్పడిన రాజకీయ విబేధాలతో పనులు కేటాయించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు