బాల్యానికి మూడుముళ్లు..!

4 Mar, 2019 08:45 IST|Sakshi

చిరుప్రాయంలోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు 

జిల్లాలో నిత్యం ఏదో ఓ చోట ఘటనలు 

యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 అడ్డగింత

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 51 వివాహాలను అడ్డుకున్న షీ టీంలు

సాక్షి, యాదాద్రి : అధికార యంత్రాంగం చర్యలెన్ని చేపట్టినా జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు వెరసి చిరుప్రాయంలోనే అమ్మాయిలు పెళ్లిపీటలెక్కుతున్నారు. అందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కాలంలో రాచకొండ పోలీసులు, షీటీంలు, ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాలే నిదర్శనం. 

గుట్టుచప్పుడు కాకుండా..
జిల్లాలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాత  చేయాల్సిన వివాహాలు 13ఏళ్లకే  చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు అడ్డుకుంటున్నా గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరుగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కమిషనరేట్‌ పరిధిలో 51 బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకోగా ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్‌(ఎం), భువనగిరి, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, వలిగొండ
ఇలా అన్ని మండలాల్లో నిత్యం ఏదో ఒక చోట బాల్య వివాహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.  

బాల్య వివాహాలతో అనర్థాలు
హైస్కూల్‌ స్థాయిలోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేయడంవల్ల వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అంతేకాకుండా భార్య, భర్తల మధ్యన వివాదాలు తలెత్తి విడాకులకు దారితీస్తున్నాయి.  బాల్యవివాహాలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు వివిధ కారణాలతో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

బాల్య వివాహాలకు కారణాలు..
బాల్య వివాహాలు జరుగడం వెనక పలు సామాజిక కారణాలు ఉన్నాయి. మేనరికం, సమాజంలో బాలికల పట్ల జరుగుతున్న లైంగిక దాడులు, ప్రేమ పేరుతో వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై వివిధ శాఖల అధికారులు నిర్వహిస్తున్న ప్రచారం మొక్కుబడిగా కాకుండా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. బాల్యవివా హాలకు సబంధించిన చట్టాలు, అతిక్రమిస్తే పడే శిక్షలు, చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలగురించి ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద బోర్డులపై రాయించాలి. 

41 బాల్య వివాహాల అడ్డగింత
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 51బా ల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. 13ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు వివాహాలు చేస్తుండగా అందిన సమాచారం మేరకు షీ టీం సభ్యులు, స్థానిక పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు తక్షణమే స్పందించి ఘటనా స్థలాలకు వెళ్లి అడ్డుకున్నారు. వారి కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలతోపాటు బాల్య వివాహాలు చేస్తే నేరమని ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులతోపాటు మధ్యవర్తులు అందరిపైన కేసులు నమోదవుతాయని వివరిస్తున్నారు.
 
షీటీం రాకతో ఆగిన బాల్యవివాహం
తుర్కపల్లి మండలం పెద్దతండాలో ఫిబ్రవరి 22న షీటీం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. 17 ఏళ్ల బాలికను 25ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. 23న వివాహాం జరగాల్సి ఉండగా సమాచారం అందుకున్న షీటీం సభ్యులు స్థానిక పోలీసుల సహకారంతో ముందు రోజే వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబాలకు  కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించి పెళ్లిని అడ్డుకున్నారు. 

షీటీంలు అడ్డుకున్న బాల్య వివాహాలు ఇలా...
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో షీటీంలు ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. భువనగిరి షీటీం ఆధ్వర్యంలో 28, చౌటుప్పల్‌ షీటీం 13, ఇబ్రహీంపట్నం షీ టీం 5, మల్కాజ్‌గిరి షీ టీం 3, ఎల్‌బీనగర్‌ షీ టీం 1, కుషాయిగూడ షీటీం1 మొత్తం 51 బాల్యవివాహాలను ఇటీవల కాలంలోనే అడ్డుకున్నారు. ఇందులో 13 ఏళ్ల వయస్సున్న రెండు, 14 ఏళ్ల వయస్సు మూడు, 15 ఏళ్ల వయస్సు 7, 16 ఏళ్ల వయస్సు 19, 17 ఏళ్ల వయస్సు 20 వివాహాలను అడ్డుకుని వారి కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  

బాల్య వివాహాలు నేరం
బాల్య వివాహాలు చేయడం నేరం. అమ్మాయిల వయస్సు 18, అబ్బాయిల వయస్సు 21ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. అంతకంటే లోపు వివాహాలు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ 2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జరిమానా, జైలు శిక్ష రెండు విధించే అవకాశం ఉంది.వివాహం జరిపిన పెళ్లి పెద్ద నుంచి పురోహితుడు, పెళ్లికి హాజరైన వారందరిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మైనర్‌ బాల, బాలికలు కచ్చితంగా చదువుకోవాలి. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100కు డయ ల్‌ చేయా లి. లేదా 9490617111 వాట్సాఫ్‌ నంబర్‌ 24గంటలు అందుబాటులో ఉంటుంది. 
          –మహేశ్‌భగవత్, రాచకొండ సీపీ  

Read latest Nalgonda News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు