అనధికారిక నివాసంపై 16 మంది మాజీ మంత్రులకు నోటీసులు

31 Jul, 2014 01:00 IST|Sakshi
అనధికారిక నివాసంపై 16 మంది మాజీ మంత్రులకు నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాల్లో అనధికారికంగా నివాసముంటున్న 16 మంది కేంద్ర మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి  మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.  లోక్‌సభలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు వెంకయ్య లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అనధికారికంగా నివాసముంటున్న మాజీ మంత్రులు జూలై 27 వరకు డ్యామేజీ చార్జీల కింద రూ. 20,92,463 చెల్లించాల్సి ఉంటుందన్నారు. టైపు-5 బంగళకు రూ. 53,250 నుంచి టైపు-3 బంగ్లాకు రూ.2,43,678 వరకు చార్జీలు ఉన్నట్టు తెలిపారు.

అనధికారికంగా నివాసముంటున్న వారిలో మాజీ మంత్రులు కపిల్ సిబల్, అజిత్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, బేణీ ప్రసాద్‌వర్మ, పల్లంరాజు, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, మానిక్‌రావ్ హోదయ్ గవిత్ ఉన్నారు. జనరల్ పూల్ కోటా కింద నివాసముంటున్న వారిలో ఎ.కె.ఆంటోనీ, ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, వీరప్పమొయిలీ,  కె.చిరంజీవి, జేడీ శీలం తదితరులు ఉన్నారు. వీరికి ఖాళీ చేయడానికి 15 రోజుల గడువు ఇచ్చారు.  కాగా, తనకు  కేటాయించిన భవనాన్ని ఐదు రోజుల క్రితమే ఖాళీ చేశానని మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి  తెలిపారు.
 

మరిన్ని వార్తలు