కరోనా ఉగ్రరూపం 

29 Jun, 2020 01:46 IST|Sakshi

దేశంలో ఒక్క రోజులో 19,906 కేసులు.. 410 మంది మృతి

మొత్తం కేసులు 5,28,859.. మరణాలు 16,095

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కత్తులు దూస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వరుసగా ఐదో రోజు 15 వేలకుపైగా కేసులు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా.. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం. గత 24 గంటల్లో 410 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 5,28,859కు, మరణాలు 16,095కు చేరాయి.  ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,03,051 కాగా, 3,09,712 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఇండియాలో జూన్‌ 1 నుంచి 28వ తేదీ వరకు 3,38,324 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటిదాకా 82,27,802 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది.

రికవరీ రేటు 58.56 శాతం  
దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరుగుతుండడం సానుకూల పరిణామం. రికవరీ రేటు ప్రస్తుతం 58.56 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసులు, కరోనా నుంచి కోలుకున్నవారి మధ్య తేడా లక్షకుపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యత్యాసం ఆదివారం నాటికి 1,06,661 అని తెలియజేసింది.  దేశవ్యాప్తంగా 1,055 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటళ్లలో 1.77 లక్షల ఐసోలేషన్‌ పడకలు, 23,168 ఐసీయూ పడకలు, 78,060 ఆక్సిజన్‌ సపోర్టెడ్‌ బెడ్లు ఉన్నాయి. అలాగే 2,400 కోవిడ్‌ హెల్త్‌ సెంటర్లలోనూ సేవలందిస్తున్నారు. అంతేకాకుండా 8.34 లక్షల పడకలు సైతం అందుబాటులోకి వచ్చాయి.

ముంబైలోని ఓ మురికివాడలో మెడికల్‌ క్యాంపు నిర్వహించేందుకు వెళ్తున్న ఆరోగ్య కార్యకర్తలు

మరిన్ని వార్తలు