లక్ష్యం బాటలోనే ద్రవ్యలోటు...

2 Feb, 2017 03:13 IST|Sakshi
లక్ష్యం బాటలోనే ద్రవ్యలోటు...

2017–18లో లక్ష్యం 3.2%  
అటు తర్వాతి ఏడాది 3 శాతానికి కట్టడి


ప్రభుత్వ ఆదాయం–వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యాల బాటకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2017–18 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దీనిని 3 శాతంగా కొనసాగిస్తామనీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వ్యయాల విషయంలో రాజీపడకుండానే ఈ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బడ్జెట్‌ లక్ష్యం 3.5 శాతం.

రెవెన్యూ లోటు ఇలా...
ఇక రెవెన్యూ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం 2.3 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గితే,   దీనిని 2017–18లో
1.9 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం ప్యానల్‌ చెప్పిందేమిటి?
వచ్చే మూడేళ్లలో 3 శాతం ద్రవ్యలోటు లక్ష్యం ఉండాలని మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని ఎఫ్‌ఆర్‌బీఎం సమీక్షా సంఘం సూచించింది. రెవెన్యూలోటు విషయంలో ఈ లక్ష్యం 2 శాతంగా ఉంది.

మార్కెట్‌ రుణ సమీకరణ విధమిది..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర మార్కెట్‌ రుణ సమీకరణలు రూ. 4.25 లక్షల కోట్లుకాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం దీనిని రూ. 3.48 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు రూ.75,000 తక్కువ. ఇక స్థూల రుణ సమీకరణల విషయానికి వస్తే– ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 6 లక్షల కోట్ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5.8 లక్షల కోట్లకు బడ్జెట్‌ తగ్గించింది. స్థూల రుణాల పద్దులో గత రుణాల పునఃచెల్లింపులు, వడ్డీలు కూడా కలిసి ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత రుణాలపై రీపేమెంట్లను రూ.1.5 లక్షలుగా బడ్జెట్‌ నిర్ణయించింది.

మార్కెట్‌ స్థిరీకరణ పథకం (ఎంఎస్‌ఎస్‌) పథకం కింద ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1.01 లక్షల కోట్ల బాండ్లను జారీ చేస్తే...  ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లుగా బడ్జెట్‌ నిర్దేశించింది. ఎంఎస్‌ఎస్‌ ఫ్లోటింగ్‌ బాండ్ల రుణాన్ని మార్కెట్‌లో ద్రవ్యలభ్యత నిర్వహణకు వినియోగిస్తారు. నిజానికి ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.20,000 కోట్లుగానే అంచనావేయడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మార్కెట్‌లో అదనపు లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)ని పెంపొందించడానికి ఈ పరిమితిని రూ.1.01 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచింది.

మరిన్ని వార్తలు