300 ఇంజినీరింగ్‌ కాలేజీలు మూత

2 Dec, 2017 10:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు నాలుగైదేళ్లుగా దేశంలో ఇంజినీరింగ్‌ విద్యను చదివేవారి సంఖ్య అసాధరణరీతిలో తగ్గుతూ వస్తోంది. యూనివర్సిటీలు,  ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల విషయాన్ని పక్కనపెడితే.. సాధారణ కాలేజీలవైపు విద్యార్థులు ముఖం కూడా తిప్పడం లేదు. దీంతో వరుస విద్యాసంవత్సరాల్లో అడ్మిషన్స్‌.. చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 300 ఇంజినీరింగ్‌ కాలేజీలు మూతకు సిద్ధమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయా కాలేజీలు ఆలిండియా కౌన్సెల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)కి స్పష్టం చేశాయి. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2018-19 నుంచి అకడమిక్‌ కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఆయా కాలేజీలు ఏఐసీటీకి తెలిపాయి. ఇదిలా ఉండగా 300 కాలేజీల్లో గత ఐదేళ్లుగా.. 30 శాతంకంటే తక్కువగానే విద్యార్థులు చేరుతున్నారు. ఇదిలా ఉండగా మరో 500 కాలేజీల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉందని మానవ వనరుల అభివృద్ధి మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఐదేళ్ల విద్యాసంవత్సరంలో 30 శాతం కంటే తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలను మూసివేయకుండా.. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఏఐసీటీఈ కోరింది. ప్రధానంగా సైన్స్‌, ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలుగా మార్చుకోవాలని ఆయా యాజమాన్యాలకు ఏఐసీటీఈ కోరింది. దేశవ్యాప్తంగా 3000 వేల ఇంజినీరింగ్‌ కాలేజీలు అండర్‌ గ్యాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తున్నాయని ఏఐసీటీఈ పేర్కొంది. ఇందులో సుమారు 13.56 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,361 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1500, తమిళనాడులో 1300, యూపీలో 1,165, ఆంధ్రప్రదేశ్‌లో 800 కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలపై సెప్టెంబర్‌ రెండో వారంలోగా యాజమాన్యాలు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రవేశాలను పెంచుకునేందుకు తమకు ఏడాది గడువు ఇవ్వాలని కొన్ని కళాశాలలు ఏఐసీటీఈని కోరినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు