చంద్రబాబు దీక్ష ఖరీదు రూ. 5 కోట్లు!

13 Oct, 2013 04:30 IST|Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దేశ రాజధాని ఢిల్లీలో చేసిన దీక్షకు కోట్ల రూపాయలు ఖర్చయిందని.. అయినా కానీ అనుకున్న ప్రచారం దక్కలేదని ఆ పార్టీ నేతలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబు నాలుగు రోజుల పాటు దీక్ష చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన అంశంపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవటంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ బయలుదేరటానికి కొద్ది రోజుల ముందు నుంచే టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఢిల్లీకి పెద్దఎత్తున తరలిరావాలని నేతలను కోరారు.
 
 ఆ మేరకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటు, విమాన ప్రయాణాలు, ఢిల్లీలో ప్రత్యేక వాహనాల ఏర్పాటు, అందరికీ బస, భోజన వసతులన్నీ సమకూర్చారు. దాదాపు 200 మంది నేతలంతా దీక్ష కోసం విమానాల్లో ఢిల్లీ వచ్చారు. ఏపీ భవన్‌తో పాటు సమీపంలోనే అనేక హోటళ్లలో వారికి బస ఏర్పాట్లు చేశారు. విమాన చార్జీల కింద  40 లక్షల రూపాయల వరకు చెల్లించినట్టు పార్టీ నేతలు చెప్పారు. పార్టీ చెల్లించినవి కాకుండా పలువురు నేతలు సొంతంగా విమాన చార్జీల కోసం లక్షలు చెల్లించారు. ఇక కార్యకర్తలను తరలించటానికి హైదరాబాద్, విజయవాడల నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. ఒక్కో రైలుకు దాదాపు 40 లక్షల రూపాయల మేర చెల్లించాల్సి వచ్చినట్టు తెలిసింది.
 
 ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న రైళ్లు అయినందున దీక్ష పూర్తయ్యేంతవరకు వీటిని ఢిల్లీలోనే నిలిపివేయగా రోజుకు వెయిటింగ్ చార్జీలు చెల్లించాల్సివచ్చింది. ఈ లెక్కన ఆ రెండు రైళ్ల కోసమే కోటి రూపాయల మేర చెల్లించారు. వీటిలో ప్రయాణించిన నేతలు, కార్యకర్తల ఖర్చులు వీటికి అదనం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలకు బస ఏర్పాట్లను పార్టీయే చూసింది. ఇందుకోసం భారీ మొత్తం వెచ్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు ఏపీ భవన్లో, మరికొందరు స్టార్ హోటల్‌లో బస చేశారు. వీరి బస ఏర్పాట్లను ప్రభుత్వం భరించింది. ఏపీ భవన్‌లో సింగిల్ బెడ్ రూంకు రోజుకు మూడు వేలు, డబుల్ బెడ్ రూంకు రోజుకు ఆరు వేలు చొప్పున వసూలు చేస్తారు.
 
 అదే స్టార్ హోటల్‌లో అయితే ఇక ధరలు చెప్పక్కరలేదు. ఏపీ భవన్‌లో 40 గ దులను టీడీపీకి కేటాయించారు. ఒక స్టార్ హోటల్‌లో కూడా సుమారు 20 గదుల వరకూ ప్రొటోకాల్ అధికారులు ఇందుకోసం బుక్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారికి అల్పాహార, భోజన, రవాణా, వసతి ఏర్పాట్లను పార్టీనే చేసింది. ఇందుకు సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకూ ఖర్చయి ఉంటాయని ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించిన నాయకుడొకరు చెప్పారు. అన్నీ కలుపుకుంటే చంద్రబాబు దీక్షకు సు మారు నాలుగున్నర నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటాయని టీడీపీ నేతలు చెప్తున్నారు.
 
 ఢిల్లీ స్థాయిలో ప్రతిష్టకు పాతర...
 ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఆశించిన ఫలితం దక్కకపోవడంపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు తాను సమైక్య వాదో, విభజన వాదో ఇంత వరకూ స్పష్టం చేయలేదు. ఏ విషయం చెప్పకుండా ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రోజులు దీక్ష ఎందుకు చేశామో తమకు అర్థం కావటం లేదని టీడీపీ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. దీక్ష ప్రారం భించే ముందు చంద్రబాబు ఏపీ భవన్‌లోని గురజాడ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో విలేకరులు ‘మీరు సమైక్యవాదా? విభజన వాదా? సమన్యాయం అంటే ఏమిటి? తెలంగాణ అంశానికి కట్టుబడి ఉన్నారా?’ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించినా ఎలాంటి స్పష్టమైన సమాధానం చెప్పలేదు. దీంతో దేశ  రాజకీయాల్లో చక్రం తిప్పామని చెప్పుకునే తమ ప్రతిష్ట ఢిల్లీ స్థాయిలో దెబ్బతిన్నదని పార్టీ నేతలు వాపోతున్నారు. ఇదిలావుంటే.. చంద్రబాబు చేపట్టిన నిరవధిక దీక్షకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. ఏపీ భవన్ లో చంద్రబాబు బృందానికి కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి మరీ సమకూర్చారు.
 
 ప్రత్యేక రైలు ఇంకో రోజు వాయిదా...
 ఇదిలావుంటే.. చంద్రబాబు దీక్షను పోలీసులు భగ్నం చేయటాన్ని నిరసిస్తూ  శనివారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం తిరిగి హైదారాబాద్ వెళ్లాల్సిన కార్యకర్తలు, నేతలతో కూడిన ప్రత్యేక రైలును ఆపివేశారు. ఆ రైలు ఆదివారం బయలుదేరుతుంది. రాష్ట్రంలో ఒకవైపు పై-లీన్ తుపాను ప్రమాదం, మరోవైపు దసరా పండుగ వేళ తమ ప్రయాణాన్ని వాయిదా వేయించడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు