బాసా.. మజాకా..

13 Oct, 2013 04:28 IST|Sakshi
బాసా.. మజాకా..

 నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: ఏతప్పు చేయకపోయినా బాస్‌కు ఇష్టం లేని పని చేస్తే మాత్రం అధికారులకు వేటు తప్పదు. ఇంతకీ ఎవరా బాస్ అనుకుంటున్నారా... ఎవరో కాదండి మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి... ఆయన ఆగ్రహానికి గురైతే ఏ అధికారిపైనైనా వేటు తప్పదు... శుక్రవారం స్థానిక 17వ డివిజన్‌లో రోడ్డు శంకుస్థాన కార్యక్రమంలో శిలాఫలకంలో మాజీ మేయర్ భానుశ్రీ పేరు లేదని ఎమ్మెల్యే వివేకానందరెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

వెంటనే వీరు చేస్తున్న పనుల నుంచి తొలగించి ఇతర పనులు అప్పగించాలని కమిషనర్‌ను ఆదేశించడమే ఇందుకు నిదర్శనం. అంతే ఆయన ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం చకచకా ఫైలు కదిలింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఇతర పనులను అప్పగిస్తూ కమిషనర్ జాన్‌శ్యాంసన్  ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మర్ స్టోరేజ్ పనులను చూస్తున్న డీఈఈ చంద్రయ్య, ఏఈఈ సుబ్బారెడ్డి స్థానంలో బాస్ వేటుకు గురైన డీఈఈ అనిల్‌కుమార్, ఏఈఈ ప్రసాద్‌ను నియమించారు.
 
 వీరి స్థానంలో సమ్మర్ స్టోరేజ్ పనులు చూస్తున్న ఇంజనీరింగ్ అధికారులను నియమించారు. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ప్రొటోకాల్ ప్రకారంగా తాము వ్యవహరించి నందుకు తాము నిర్వర్తించే విధుల నుంచి ఇతర పనులకు కేటాయించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇంజనీరింగ్ అధికారుల విషయంలో జరిగిన తీరుతో ఇతర అధికారులు బాస్ ఎప్పుడు ఎవరిపైన ఆగ్రహిస్తాడో తెలీదు.. ఒక వేళ ఏదైనా సందర్భంలో తమపై ఆగ్రహించారో తమకు వేటు తప్పదని కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు వాపోతున్నారు. బాస్‌కు నచ్చినట్లు ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించాలంటే ఎలా కుదురుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేయాలో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు