భారత్‌లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు

4 May, 2017 01:49 IST|Sakshi
భారత్‌లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు

 2005–14 మధ్య ప్రవేశం
- అమెరికా సంస్థ నివేదిక

న్యూఢిల్లీ: భారతదేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు 770 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.50 లక్షల కోట్లు) నల్లధనం వచ్చిందని అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) తాజా నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో 165 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) నగదు దేశం నుంచి అక్రమంగా వెళ్లిపోయినట్లు జీఎఫ్‌ఐ పేర్కొంది. ‘ఇల్లిసిట్‌ ఫైనాన్షియల్‌ ఫ్లోస్‌ టు అండ్‌ ఫ్రమ్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌: 2005–2014’ అనే శీర్షికతో జీఎఫ్‌ఐ నివేదికను రూపొందించి విడుదల చేసింది. దీని ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2014 సంవత్సరంలోనే 101 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 6 లక్షల కోట్లు) నల్లధనం భారత్‌లోకి రాగా.. 23 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. లక్షన్నర కోట్లు) నగదు భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లినట్లు తేలింది.

ఈ పదేళ్లలో భారత దేశానికి వచ్చిన నల్లధనం.. దేశం మొత్తం వ్యాపార లావాదేవీల టర్నోవర్‌లో 14 శాతమని, దేశం నుంచి వెళ్లిపోయిన నల్లధనం మూడు శాతమని నివేదిక వెల్లడించింది. నల్లధనాన్ని గుర్తించేందుకు.. అన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని నివేదిక సూచించింది. బహుళజాతి కంపెనీలు ఆదాయం, లాభాలు, నష్టాలు, అమ్మకాలు, పన్నుల చెల్లింపు, సిబ్బంది తదితర వివరాలు వెల్లడించేలా ఆయా దేశాల పాలకులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు