డీఫ్‌ ఫేక్ వీడియోల కట్టడి.. నేడు, రేపు కీలక సమావేశం

23 Nov, 2023 10:47 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  ఇంటర్నెట్‌లో డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యాప్తి ఈమధ్య ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ సాయంతో  సైబర్‌ నేరగాళ్లు, ఆకతాయిలు  అశ్లీల, నకిలీ.. విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు.  సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్‌ బలమైన సాధనమే అయినప్పటికీ.. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయడం గమనార్హం.  ఈ తరుణంలో డీప్‌ఫేక్‌ తరహా వ్యవహారాల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. 

నేడు,రేపు(నవంబర్‌ 23,24వ తేదీల్లో) సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ సమావేశం కానుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం జరిగే సమావేశంలో మార్ఫింగ్‌ కంటెంట్‌(ఫొటోలు, వీడియోలు) అంశాల కట్టడిపై, శుక్రవారం జరిగే భేటీలో ఐటీ నిబంధనలపై చర్చించనున్నారు. డీప్ ఫేక్ కంటెంట్‌ వ్యాప్తి కట్టడికి అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు. ఈ తరుణంలో.. చట్టం రూపకల్పన, ఇతరత్రా అంశాలపై సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ప్రతినిధులతో కేంద్రం సమాలోచనలు జరిపే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

వాస్తవానికి డీఫ్‌ ఫేక్‌ కంటెంట్‌ వ్యవహారం ఇంటర్నెట్‌లో చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ.. నటి రష్మిక మందన్న వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే పలువురు ప్రముఖుల విషయంలోనూ ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు  కేంద్రం చర్యలు చేపట్టింది.

తాజాగా.. బుధవారం జరిగిన జీ20 వర్చువల్‌ సమ్మిట్‌ ముగింపు ప్రసంగంలోనూ ప్రధాని మోదీ డీప్‌ఫేక్‌ సమస్యను ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఏఐ ప్రతికూల ప్రభావాల గురించి ప్రపంచం ఆందోళన చెందుతోంది. సమాజానికి డీప్‌ఫేక్‌ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడంతో పాటు డీప్‌ఫేక్‌ల నుంచి సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి’’ అని ప్రధాని మోదీ జీ20 సభ్య దేశాలకు పిలుపు కూడా ఇచ్చారు.

మరిన్ని వార్తలు