ఆ కంపెనీలో 8 మందకి కరోనా పాజిటివ్‌!

18 May, 2020 12:56 IST|Sakshi

గ్రేటర్ నోయిడా: మార్చి నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ కరోనా వైరస్‌ కారణంగా ఎక్కడికక్కడ అన్ని మూతబడ్డాయి. అయితే మే 9 నుంచి కేంద్రప్రభుత్వం కొన్ని కంపెనీలకు తక్కువ మంది సిబ్బందితో వాటి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి అనుమతినిచ్చింది. దీంతో కొన్ని కంపెనీలు తమ పనులను ప్రారంభించాయి.వాటిలో ప్రముఖ మొబైల్‌ కంపెనీ దిగ్గజం ఒప్పొ కూడా ఉంది. అయితే గ్రేటర్‌ నోయిడాలోని ఒప్పో కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది సిబ్బందికి ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో కంపెనీలో పనులన్నింటిని ఆపేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆపేసిన పనులను ఒప్పో మే 9 నుంచి ప్రారంభించింది. (ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్)

ఈ విషయం గురించి ఒప్పో ప్రతినిధులు మాట్లాడుతూ మాకు మా ఉద్యోగులు, సమాజ భద్రతే ముఖ్యం. గ్రేటర్‌ నోయిడాలో ఉన్న మా కంపెనీ కార్యకలాపాలన్నింటిని మేం ప్రస్తుతం నిలిపేశాం. అదేవిధంగా అక్కడ పనిచేస్తోన్న 3000 మందికి పైగా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నాం అని తెలిపారు.  అయితే వారికి ఏ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తున్నారో మాత్రం సంస్థ తెలుపలేదు. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో 96,169 కేసులు నమోదు కాగా, 36,823 మంది ​​కోలుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా గరిష్టంగా 5000లకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.   (లాక్డౌన్ 4.0: కొత్త నిబంధనలు ఇవే!)

మరిన్ని వార్తలు