మరో వివాదంలో అలీగఢ్ యూనివర్సిటీ

28 Nov, 2014 11:56 IST|Sakshi
మరో వివాదంలో అలీగఢ్ యూనివర్సిటీ

అలహాబాద్ : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో  మరో వివాదం నెలకొంది.  యూనివర్సిటీ లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతించేది లేదన్న వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ...ఆనక కోర్టు మొట్టికాయలు వేయటంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా రాజా మహేంద్ర ప్రతాప్ జయంతి వేడుకలు వర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీస్తాయని జమీరుద్దీన్ షా వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే జాట్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు రాజా ప్రతాప్ సింగ్‌.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి అప్పట్లో భూమిని దానంగా ఇచ్చారు. ఆ విషయాన్ని పురస్కరించుకొని ఏటా డిసెంబర్ ఒకటిన మహేంద్ర ప్రతాప్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి వేడుకలను క్యాంపస్‌లో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించడం వివాదం రేపుతోంది.

కమలదళం తీరును సమాజ్‌వాదీ, వర్సిటీ విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకించగా తాజాగా వర్సిటీ వీసీ కూడా కార్యక్రమంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన ఆయన క్యాంపస్‌లో వేడుకలు నిర్వహిస్తే ఘర్షణలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.

రాజకీయ పార్టీల జోక్యంతో వర్సిటీలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం క్యాంపస్‌లోనే వేడుకలు నిర్వహిస్తామని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు