రైల్లో ప్రయాణించాలంటే ఆధార్ తప్పనిసరి

7 Jul, 2016 19:41 IST|Sakshi
రైల్లో ప్రయాణించాలంటే ఆధార్ తప్పనిసరి

భారతీయ రైళ్లలో ప్రయాణించాలంటే ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డు తప్పనిసరి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైలు టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాలన్నా, అప్పటికప్పుడు బుకింగ్ కౌంటర్లో కొనుక్కోవాలన్నా ఆధార్ నెంబరు కలిగి ఉండటం తప్పనిసరి. రైల్వే టిక్కెట్లలో వివిధ కేటగిరీల కింద ఇస్తున్న సబ్సిడీల భారాన్ని బాగా తగ్గించడమే ఈ నిర్ణయం వెనకనున్న అసలు లక్ష్యం. ఆధార్ కార్డులను ప్రోత్సహించడం కూడా తమ ఉద్దేశమని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు.

సామాజిక బాధ్యతలో భాగంగా ప్రస్తుతం భారతీయ రైల్వేలు 53 కేటగిరీల కింద టక్కెట్ల ధరల్లో సబ్సిడీలు ఇస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గుండెజబ్బు రోగులు... ఇలా వివిధ కేటగిరీల కింద ఇస్తున్న సబ్సిడీల భారం ఏటికేడాది పెరుగుతోందని, 2015-16 సంవత్సరంలో ఈ భారం 3,400 కోట్ల రూపాయలని రైల్వే అధికారులు తెలిపారు. సబ్సిడీ టిక్కెట్ల దుర్వినియోగాన్ని అరికడితే ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని వారు భావిస్తున్నారు. రైలు టిక్కెట్లకు, ఆధార్ కార్డు నెంబర్‌కు ముడిపెడితే ఈ దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టవచ్చన్నది వారి అభిప్రాయం.

రెండు దఫాలుగా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. ముందుగా సబ్సిడీ కేటగిరీలకు ఆధార్ కార్డులను లింక్ చేస్తారు. ఈ విధానాన్ని 15 రోజుల్లోనే అమల్లోకి తీసుకొస్తామని, జనరల్ కేటగిరీకి రెండు నెలల్లో అమలు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. జనరల్ కేటగిరీలో కూడా ముందుగా రిజర్వ్ కేటగిరీకి ఆధార్‌ కార్డును ముందుగా లింక్ చేస్తారు. ఆ తర్వాత అన్ రిజర్వుడు కేటగిరీకి కూడా అమలు చేస్తారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సర్వీసుకు కూడా ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా ఆధార్ కార్డు నెంబర్‌ను కొడితేనే టిక్కెట్ రిజర్వ్ అవుతుంది.

ప్రతి టిక్కెట్‌పైనా ఆధార్ కార్డు నెంబర్‌ను ముద్రిస్తామని, ఆ నెంబర్‌తోపాటు ప్రయాణికుడి ఫొటోను, చిరునామా వివరాలను టెక్కెట్ తనిఖీదారుల మొబైళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఈ సౌకర్యం వల్ల టిక్కెట్ బుక్ చేసుకున్నవారే రైల్లో ప్రయాణిస్తున్నారా, లేదా అన్న విషయం టీసీలకు ఇట్టే తెలిసిపోతుందని వారు చెప్పారు. దేశంలో ఇప్పటికే 96 శాతం మంది పౌరులకు ఆధార్ కార్డులు ఉన్నందున తాము రైల్వే టిక్కెట్లకు ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా ఎవరికీ ఇబ్బందులు తలెత్తవని వారు అంటున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ కింద చౌకగా ఇచ్చే సరకులకు, ఎల్‌పీజీ సిలిండర్లకు మాత్రమే ఆధార్ కార్డును పరిమితం చేయాలని, మిగతా ప్రభుత్వ సర్వీలకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయం వ్యతిరేకమైనది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా తుది తీర్పును ఇంకా వెలువరించాల్సి ఉంది. ప్రస్తుతం ఆధార్ అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు