53 నగరాల్లో ఆధార్‌ సేవా కేంద్రాలు

10 Oct, 2018 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల మాదిరిగా ఉండే ఆధార్‌ సేవా కేంద్రాలను సొంతంగా ప్రారంభించాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 53 నగరాల్లో నెలకొల్పబోయే ఈ కేంద్రాల్లో ఆధార్‌ నమోదుతోపాటు వివరాల్లో మార్పులు చేసుకునేందుకు వీలుంటుంది. యూఐడీఏఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నడుస్తున్న 30 వేల కేంద్రాలకు ఇవి అదనం.

పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. వీటి ఏర్పాటుకు సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి యూఐడీఏఐ ప్రతిపాదనలు కోరుతోంది. కొత్తగా ఆధార్‌ నమోదు, వివరాల్లో మార్పులు చేర్పులు చేయడం వంటి సేవలను పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో మాదిరిగానే అపాయింట్‌మెంట్‌ ఆధారితంగా అందజేస్తారు.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నాలుగేసి కేంద్రాలు, ఇతర నగరాల్లో రెండు చొప్పున ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 2019 ఏప్రిల్‌ నుంచి పని చేసే ఈ ఆధార్‌ సేవా కేంద్రాల ఏర్పాటుకు రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 4 లక్షల  మంది ఆధార్‌ వివరాల్లో మార్పులు చేసుకుంటుండగా లక్ష మంది వరకు కొత్తగా పేరు నమోదు చేయించుకుంటున్నారు. ఇప్పటిదాకా 122 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు జారీ చేసినట్లు అంచనా.

మరిన్ని వార్తలు