ఏ అమ్మాయి ఇలా చేయగలదు?

29 Jun, 2016 10:26 IST|Sakshi
ఏ అమ్మాయి ఇలా చేయగలదు?

రాంచీ: కష్టానికి గుర్తింపు ఆలస్యంగా రావొచ్చేమోగానే తప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ కష్టం మాయమవుతుంది.. మరో నలుగురి కష్టాలను తీర్చేంత సమర్థులుగా మారుస్తుంది. జార్ఖండ్లో ఓ బాలిక జీవితంలో ఇదే జరిగింది. మీరా ఖోయా అనే పదహారేళ్ల బాలిక ఇటీవల పదో తరగతి మంచి మార్కులతో పాసైంది. అది కూడా కష్టాలతో నిండిన బతుకునీడుస్తూ.. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి చేతికి దొరికిన పని చేసుకుంటూ వెళుతోంది.

ఎనిమిదేళ్ల వయసులోనే కష్టాల ప్రపంచంలోకి మీరా అడుగుపెట్టింది. నిర్మాణ సంబంధమైన పనుల్లో తనకు చేతనైన పని చేసుకుంటూ వెళ్లింది. ప్రతి రోజు తలపై ఇటుకలు మోస్తూనే చదువు కొనసాగించింది. తరగతులు మిస్సయినప్పుడు చిన్న తరహా ప్రైవేటు పాఠశాల వద్దకు వెళ్లి మెటీరియల్ తెచ్చుకుంది. రోజుకు పన్నెండు గంటలు తలపై ఇటుకలు మోస్తూనే ఎట్టకేలకు పదో తరగతి పాసైంది. మీరా జీవితం గురించి తెలియడంతో పలువురు ఆమెను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

కష్టాలతోపాటు చదువుకొనసాగిస్తున్న ఆమెకు అండగా నిలిచారు. ముఖ్యంగా ఆమెకు రాంచీలోని నిర్మలా వుమెన్స్ కాలేజీలో సీటు వచ్చింది. అది రాంచీలో బెస్ట్ కాలేజీ. ఆమెకు ఉచిత విద్యను, హాస్టల్ సౌకర్యాన్ని ఇవ్వడంతోపాటు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యం ముందుకొచ్చింది. ఆమెను ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దేందుకు తమకు అవకాశం రావడం తమ అదృష్టం అని ప్రకటించింది. బాగా కుదిరినప్పుడు రోజుకు రెండు వందల రూపాయలు సంపాధించే మీరా ఖాతాలో ప్రస్తుతం ఓ మూడు లక్షల వరకు డబ్బు ఆపన్నులు జమ చేసి ఉంచారు. కష్టాల కడలిదాటిన మీరా చదువుల సంద్రాన్ని విజయవంతంగా ఈదుతుందా లేదా చూడాలి.

మరిన్ని వార్తలు