ఈ రెండు స్టేషన్లలోనే ఆత్మహత్యలు అధికం

10 Nov, 2014 23:10 IST|Sakshi

సాక్షి, ముంబై : నగరంలోని కుర్లా, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లలో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. దీంతో వీటిని ‘సూసైడ్ హాట్‌స్పాట్స్’గా పేర్కొంటున్నారు. శివారు రైలుపట్టాలపై ప్రతిరోజూ దాదాపు 10 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 79 మంది ఎదురుగా వస్తున్న రైలు కింద పడి తనువు చాలించారు.

 సెంట్రల్, వెస్టర్న్ పరిధిలోని 127 రైల్వేస్టేషన్లలో పలువురు నగరవాసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది కుర్లా, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లనే ఎంచుకుంటున్నారు.

 రైల్వే పోలీసులు ఇందుకు సంబంధించి అందజేసిన గణాంకాల మేరకు.. 2013లో 62 మంది ఆత్మహత్యలకు పాల్పడగా ఇందులో 51 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారని తేలింది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆత్మహత్య చేసుకోబోతూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వీటిలో సగానికిపైగా కేసులు కుర్లా, ముంబై సెంట్రల్ స్టేషన్లలోనే నమోదయ్యాయి.

అయితే ఈ ఏడాది మాత్రం ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు తక్కువగానే నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ముంబై సెంట్రల్‌లో మొత్తం ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుర్లాలో ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోగా వీరిలో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

 దీంతో ఇప్పటివరకు మొత్తం 17 ఆత్మహత్యల కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ రెండు స్టేషన్లనే ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారని అధికారులను మీడియా ప్రశ్నించగా దూరప్రాంతాల రైళ్లు ఎక్కువగా రావడమేనని వారు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు