త్రీమంకీస్ - 23 | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 23

Published Mon, Nov 10 2014 11:02 PM

త్రీమంకీస్ - 23

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 23
 
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘తీసుకురాను.’’
‘‘నీకు నేను జీవితంలో ఏదైనా ఖర్చు చేస్తే అది ఇప్పుడే. ఇక్కడే. ఆలోచించుకో.’’
‘‘యు ఆర్ ఏ చీట్’’ మర్కట్ ఉక్రోషంగా చెప్పాడు.
’’చూడు బాబ్జీ. నీది తర్టీఫైవ్ ఎంఎం మనసు. నాది సెవెంటీ ఎంఎం కన్నా వైడ్ స్క్రీన్ మనసు. దీన్ని బట్టే నాకు తెలిసిపోతోంది నీకు, నాకు జోడీ కుదరదని. వినలా?’’
‘‘ఏమిటి?’’
‘‘లవ్ త్రీ, సెలెక్ట్ టు అండ్ మేరీ ఒన్. నేను సెలెక్ట్ చేసుకున్న ఆ ఇద్దరిలో నువ్వు ఒకడివి. అబ్రకదబ్రా గాడితో థర్డ్ ఇయర్లో కటీఫ్ అయ్యాక నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నేను పెళ్ళి చేసుకునేది ఎన్నారైని. బై’’
   
‘‘ఇంతకీ నువ్వా ఇడ్లీలు తిన్నావా?’’ వానర్ అడిగాడు.
‘‘అంతా బావుంది కాని, నువ్వా ఛీజ్ పీజాలు, చికెన్ బర్గర్ల గురించి చెప్పకుండా ఉండాల్సింది’’ కపీష్ తన ప్లేట్‌లోని పదార్ధాన్ని చూసుకుంటూ బాధగా చెప్పాడు.
‘‘రమ్యరాము చేసింది అన్యాయం’’ వానర్ కోపంగా చెప్పాడు.
‘‘నీ సంగతేమిటి? నువ్వూ ఎవర్నో ప్రేమించావు కదా?’’ మర్కట్ వానర్ని అడిగాడు.
 వానర్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘‘నేను ప్రేమించిన సీతా హరిహరన్ రమ్యరాము అంత ఇది కాదు. చిన్న పొరపాటు వల్ల మా మధ్య తేడా వచ్చేసింది.’’
‘‘ఎవరి వైపు నించి పొరపాటు?’’
‘‘ఆమె వైపు నించే.’’
‘‘ఏమిటా పొరపాటు?’’ మర్కట్ అడిగాడు.
‘‘అసలు నీకు, ఆ పీతకి ఎలా పరిచయం అయింది?’’ కపీష్ నవ్వుతూ అడిగాడు.
‘‘నేను ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఆమెతో పరిచయం మొదలైంది.’’
‘‘ఆమె నీకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమన్న మాట’’ మర్కట్ అడిగాడు.
‘‘కాదు. ఎఫ్‌బిలో నేను అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆమె సహాయం చేయడానికి వచ్చినప్పుడు మాకు పరిచయం అయింది.’’
‘‘అదేమిటి? ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఎవరికి వారు ఓపెన్ చేసుకోవచ్చుగా? ఇంకొకరి సహాయం దేనికి?’’ కపీష్ ప్రశ్నించాడు.
‘‘నాకు అది అంత తేలిక కాలేదు.’’
వానర్ ఆనాటి అనుభవాన్ని చెప్తూంటే మిత్రులు ఇద్దరూ ఆసక్తిగా వినసాగారు.
   
ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ దాకా వానర్‌కి ఆర్కుట్లో అకౌంట్ ఉండేది. కాని ఫేస్‌బుక్‌కి ప్రాచుర్యం లభిస్తూండటంతో, అందులో కూడా అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు. కాలేజీ లైబ్రరీకి వెళ్ళి ఉచిత కంప్యూటర్ని, ఉచిత ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఫేస్‌బుక్ ఓపెనింగ్ పేజీకి వెళ్ళాడు. పేరు, వయసు లాంటివన్నీ సక్రమంగా పూర్తి చేసాక ఆ పేజీ పాస్‌వర్డ్‌ని కోరింది. ఏం పాస్‌వర్డ్ పెట్టాలి అని ఆలోచనగా చుట్టూ చూస్తే లైబ్రేరియన్ కనపడింది. ఆమె మొహం ముడతలతో, ఉబ్బెత్తుగా కనిపించడంతో ‘కేబేజీ’ అని పాస్‌వర్డ్‌ని టైప్ చేశాడు. వెంటనే ఇలా వచ్చింది.

 సారీ! ది పాస్‌వర్డ్ మస్ట్‌బి మోర్ దేన్ ఎయిట్ కేరక్టర్స్.
మరోసారి లైబ్రేరియన్ మొహాన్ని చూస్తూంటే, ఆవిడ అతని వంక చూసి నవ్వింది. వెంటనే ‘బాయిల్డ్ కేబేజి’ అని టైప్ చేశాడు.
సారీ! ది పాస్‌వర్డ్ మస్ట్ కంటైన్ ఒన్ న్యూమరికల్ కేరక్టర్ అని మళ్ళీ ఎర్ర అక్షరాల్లో కనపడింది. ఆవిడ వంక చూస్తే ముక్కు ఒకటి అంకెలా కనిపించడంతో ‘1 బాయిల్డ్ కేబేజి’ అని టైప్ చేశాడు.
సారీ! ది పాస్‌వర్డ్ కాన్ట్ హేవ్ బ్లేంక్ స్పేస్ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది.
50డేమ్‌న్డ్‌బాయిల్డ్‌కేబేజెస్’ అని టైప్ చేశాడు.
సారీ! ది పాస్‌వర్డ్ మస్ట్ కంటైన్ ఎట్‌లీస్ట్ ఒన్ అప్పర్ కేస్ కేరక్టర్ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది.
‘50డేమ్‌న్డ్‌బాయిల్డ్‌కేబేజెస్’లో డిఏఎమ్‌ఎన్‌ఇడిలని అప్పర్ కేస్‌లో టైప్ చేసి మళ్ళీ సబ్మిట్ చేశాడు.
‘సారీ! ది పాస్‌వర్డ్ మస్ట్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ కేరక్టర్స్ కంటిన్యువస్లీ’ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది.
వానర్‌కి కోపం వచ్చింది. ఇలా టైప్ చేసి సబ్మిట్ చేశాడు.
50డి-ఏ-ఎమ్-ఎన్-ఇ-డిబాయిల్డ్‌కేబేజెస్‌విల్’
సారీ! ది పాస్‌వర్డ్ కెనాట్ కంటైన్ పంక్చువేషన్స్ అని మళ్ళీ వచ్చింది.
‘నౌ!50డిఏఎమ్‌ఎన్‌ఇడిబాయిల్డ్‌కేబేజెస్‌యుఫూల్’ అని టైప్ చేసి, రీసబ్మిట్ చేశాడు.    
సారీ! ది పాస్‌వర్డ్ ఈజ్ ఆల్‌రెడీ ఇన్ యూజ్ అని కనిపించగానే వానర్‌కి పిచ్చెక్కిపోయింది. లేచి నిలబడి కీ బోర్డుని ఎత్తి నెత్తి మీద కొట్టుకోసాగాడు. సరిగ్గా ఆ సమయంలో లోపలకి వచ్చిన సీతా హరిహరన్ అతని దగ్గరకి వచ్చి అడిగింది.
‘‘ఎక్స్‌క్యూజ్‌మి! మీ పనైతే నాకు ఓసారి కంప్యూటర్ని ఇస్తారా?’’
‘‘కాలేదు.’’
‘‘మరి?’’
 ‘‘ఇదిగో. చివర్లో ఇది ఏడిపిస్తోంది’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఏమిటి? చివర్లో ఎవరు ఏడిపిస్తున్నారు?’’ ఆమె నవ్వుతూ అడిగింది.
 తన పాస్‌వర్డ్ భాగవతం వినిపించాడు.
 ‘‘మీరు కొంపతీసి ఇండస్ట్ట్రియల్ ప్రొడక్షన్ బ్రాంచా?’’ అడిగింది.
 (మన నేషనల్ బ్యాంకు ఏది? నేషనల్ పక్షి ఏది?)
 

Advertisement
Advertisement