మద్యం తాగి విమానం ఎక్కబోయిన పైలట్‌

12 Nov, 2018 04:39 IST|Sakshi

ముంబై: విమానం ఎక్కడానికి ముందు జరిపిన శ్వాస విశ్లేషణ పరీక్షల్లో పైలట్‌ విఫలం కావడంతో అతణ్ని ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా విధుల నుంచి తప్పించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఏఐ–111 విమానానికి కెప్టెన్‌ ఏకే కఠ్పాలియా పైలట్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే అతను మద్యం తాగినట్లు రెండుసార్లు పరీక్షల్లో తేలడంతో అతని స్థానంలో మరో పైలట్‌ను విధులకు రప్పించాల్సి వచ్చింది. దీంతో విమానం 55 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని ఎయిరిండియా అధికారి చెప్పారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం విమానంలో ప్రయాణించాల్సిన సిబ్బంది ఎవ్వరూ ప్రయాణ సమయానికి 12 గంటల ముందు నుంచి మద్యం సేవించకూడదు. కాగా, ఆదివారమే ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన మరో ఎయిరిండియా విమాన పైలట్‌ పొరపాటున శ్వాస విశ్లేషణ పరీక్షలో పాల్గొనకపోవడంతో విమానం ఆరు గంటలు ఆలస్యమైంది. 200 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి విమానం సరైన సమయానికే బయలుదేరినా, శ్వాస విశ్లేషణ పరీక్ష కోసం మళ్లీ ఢిల్లీ విమానాశ్రయానికి విమానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు