‘కొత్త’ రైల్వేస్టేషన్లలో యూజర్‌ చార్జీ!

13 Feb, 2020 03:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులపై విధించేలాంటి యూజర్‌ చార్జీలను కొత్తగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో విధించనున్నారు. దీంతో రైల్వే చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీ (యూడీఎఫ్‌) అనేది విమానాల్లో ప్రయాణికుడు చెల్లించే పన్నుల్లో భాగంగా ఉంటుంది. దీన్ని పలు ఎయిర్‌పోర్టుల్లో విధిస్తున్నారు.

ఈవిధంగా వసూలు చేసే చార్జీ ఒక్కో స్టేషన్‌లో ఒక్కో రకంగా ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఇక్కడి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంత చార్జీ వసూలు చేస్తామనే విషయం మంత్రిత్వ శాఖ త్వరలో తెలియజేస్తుందని అన్నారు. అమృత్‌సర్, నాగ్‌పూర్, గ్వాలియర్, సబర్మతి రైల్వే స్టేషన్లను రూ.1,296 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడంకోసం రైల్వే ప్రతిపాదనలు చేసిందన్నారు. ‘వసూలు చేసిన చార్జీ స్టేషన్ల ఆధునీకరణకు తోడ్పడుతుంది. చార్జీలు నామమాత్రంగానే ఉంటాయి’అని యాదవ్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు