రైల్వే స్టేషన్‌లలో సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్‌.. ఇక దొంగల ఆటకట్టు! 

27 Sep, 2023 18:47 IST|Sakshi

దేశంలోని రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి రైల్వే స్టేషన్లలో దొంగల ఆట కట్టించడానికి భారతీయ రైల్వే (Indian Railways) సరికొత్త భద్రతా వ్యవస్థను తీసుకొస్తోంది.

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో భద్రతను పెంచేందుకు సెంట్రల్ రైల్వే సర్వం సిద్ధం చేసింది. సెంట్రల్ రైల్వేస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. త్వరలో 364 రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన 3,652 కెమెరాలతో సహా మొత్తం 6,122 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్‌టెల్‌తో రైల్వే బోర్డు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

(iPhone 15: షాకింగ్‌.. బ్రేకింగ్‌! ఇదేం ఐఫోన్‌ భయ్యా.. వైరల్‌ వీడియో)

"ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, వీడియో అనలిటిక్స్, వీడియో మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కెమెరాలు ప్రయాణికుల భద్రతను పెంపొందిస్తాయి. నేరాలను నియంత్రిస్తాయి. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని అరికట్టగలవు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షిస్తాయి" అని ప్రకటనలో వివరించారు.

కెమెరాలు ఇలా పనిచేస్తాయి..
రైల్వే స్టేషన్‌లోకి దొంగ ప్రవేశించగానే ఈ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇందుకోసం ఇదివరకే డేటాబేస్‌లో స్టోర్‌ అయిన దొంగల ఫేస్‌ సమాచారాన్ని ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వినియోగించుకుంటాయి. ఈ కెమెరాలు కంటి రెటీనా లేదా నురురు వంటి ముఖ భాగాలను గుర్తించగలవు.

ప్రతి హెచ్‌డీ కెమెరా సుమారు 750 జీబీ డేటాను వినియోగిస్తుంది. ఇక 4K కెమెరాలు నెలకు 3 టీబీ డేటాను వినియోగించుకుంటాయి. వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్‌, ప్లేబ్యాక్, ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం 30 రోజుల పాటు నిల్వ చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు