ఆలోక్‌ పదవీ విరమణ

12 Jan, 2019 03:27 IST|Sakshi

ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన ఉద్వాసనకు గురైన సీబీఐ చీఫ్‌

అగ్నిమాపక శాఖలో చేరబోను

అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారని ఆవేదన  

న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్‌ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్‌ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు.

అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు.

సీబీఐ డైరెక్టర్‌ పదవికి ఆలోక్‌ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి.

సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని  వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్‌ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్‌ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు.

మళ్లీ బదిలీలన్నీ రద్దు
గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్‌ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్‌ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు.

ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది
ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు