ఆ మతఘర్షణలపై అమిత్‌ షా సీరియస్‌..!

3 Jul, 2019 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: హస్తినలోని హవజ్‌ ఖాజీ ప్రాంతంలో గత ఆదివారం సాయంత్రం మతఘర్షణలు జరగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పాతనగరంగా పేరొందిన చాందినీచౌక్‌ హవజ్‌ ఖాజీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పార్కింగ్‌ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఇది చినికిచినికి గాలివానగా మారి.. మతఘర్షణలు, హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో స్థానికంగా ఉన్న ఆలయం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ అముల్యా పట్నాయక్‌ను పిలిపించుకొని మరీ.. ఈ ఘటనపై ఆరా తీశారు.

హవజ్‌ ఖాజీ ఘటన గురించి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేదానిపై సాధారణ బ్రీఫింగ్‌లో భాగంగా హోంమంత్రికి సమాచారం తెలియజేశానని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని.. హోంమంత్రి షాతో భేటీ అనంతరం పట్నాయక్‌ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఒక మైనర్‌ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని, నేరగాళ్లకు ఈ ఘటనలో ప్రమేయముందని భావిస్తున్నామని ఢిల్లీ సీపీ పట్నాయక్‌ తెలిపారు.

గత ఆదివారం పండ్ల వ్యాపారి సంజీవ్‌ గుప్తా.. ఆస్‌ మహమ్మద్‌ అనే వ్యక్తుల మధ్య జరిగిన గొడవ.. ఈ మతఘర్షణలకు దారితీసింది. సంజీవ్‌ గుప్తా ఇంటిముందు ఆస్‌ మహమ్మద్‌ తన కారును పార్కు చేయడం.. దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో గుప్తాపై మహమ్మద్‌ తన మనుషులతో వచ్చి దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మహమ్మద్‌ను, మరికొంతమందిని అరెస్టు చేశారు. దీంతో ఆయన విడుదల చేయాలంటూ పోలీసు స్టేషన్‌ ఎదుట ఒక వర్గం వారు ధర్నాకు దిగడం.. ఈ ఘర్షణలకు దారితీసినట్టు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు