ఇక్కడ 100 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు: అమిత్‌ షా

9 Jun, 2020 14:46 IST|Sakshi

కోల్‌కతా: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం బెంగాల్‌లో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ‘బంగ్లార్‌ జన్‌సంభాష్‌’ వర్చువల్‌ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘నా వరకు 303 లోక్‌సభ స్థానాలు గెలవడం ముఖ్యం కాదు.. బెంగాల్‌లో 18 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చే అంశం. కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే హింసా రాజకీయాలు నడుస్తాయి. 2014 నుంచి బెంగాల్‌లో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో 100 మంది బీజేపీ కార్యకర్తలు మరణించారు. వారి కుటుంబాలకు నా వందనం. వారు బంగారు బంగ్లా అభివృద్ధికి దోహదపడ్డారు’ అన్నారు. అలానే లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీకి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అంతేకాక బీజేపీ ఇ‍క్కడికి రాజకీయ యుద్ధం చేయడానికి రాలేదని.. బెంగాల్‌ సంస్కృతిని బలోపేతం చేసేందుకు వచ్చిందని అమిత్‌ షా పేర్కొన్నారు. (ఇది అన్యాయం: అమిత్‌ షా)

ఆయుష్మాన్ భారత్ పథకం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రం ప్రయోజనం పొందడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదంటూ అమిత్ షా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మమతా దీదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని బెంగాల్‌లో అనుమతించనందున ఈ రాష్ట్ర పేదలకు ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదన్నారు. వారికి చికిత్స పొందే హక్కు లేదా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పేదల కోసం ఉద్దేశించబడింది..  వారి హక్కులను మీరు ఈ విధంగా కాలరాయడం సరికాదన్నారు అమిత్‌ షా. మమతా బెనర్జీ బెంగాల్ లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అనుమతించకపోవడాన్ని గుర్తు చేస్తూ అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
 

మరిన్ని వార్తలు