‘జోక్యం చేసుకోండి.. లేఖ అందలేదు’

12 Apr, 2019 12:49 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత సాయుధ బలగాల త్యాగాలను రాజకీయం చేస్తున్నారంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన 150 మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ‘ఫ్రమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ వెటరన్స్‌ టు అవర్‌ సుప్రీం కమాండర్‌’ పేరిట త్రివిధ దళాధిపతికి రాసిన లేఖలో సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం.. భారత సైన్యం యూనిఫాం, గుర్తులు లేదా సైనికుల త్యాగాల గురించి నాయకులు ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇటువంటి వ్యాఖ్యల గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని, దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రపతి భవన్‌ వర్గాలు మాత్రం తమకు ఎటువంటి లేఖ అందలేదని పేర్కొనడం గమనార్హం.

కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రధాని మోదీ ఈనెల 9న మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల బలిదానాలను రాజకీయ పార్టీలు, నాయకులు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ.. ఆర్మీ మాజీ చీఫ్‌లు సునీత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగస్‌, శంకర్‌ రాయ్‌చౌదరి, దీపక్‌ కపూర్‌... మాజీ నేవీ ప్రధానాధికారులు లక్ష్మీనారాయణ్‌ రామ్‌దాస్‌, విష్ణు భగవత్‌, అరుణ్‌ ప్రకాశ్‌, సురేష్‌ మెహతా, ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఎన్సీ సూరీ తదితరులతో సహా 150 మంది రిటైర్డు అధికారులు  రాష్ట్రపతికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇక.. ‘మోదీ కోసమో, రాహుల్‌ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్‌ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు మమ్మల్ని కచ్చితంగా  మరచిపోతారు. అది మాకు తెలుసు’  అంటూ పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ కౌశల్‌ కుమార్‌ రావత్‌ కూతురు అపూర్వ రావత్ రాజకీయ నాయకుల తీరును ఎండగట్టిన సంగతి తెలిసిందే‌. అయినప్పటికీ పలువురు నేతలు తమ పంథా మార్చుకోవడం లేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా