‘మీ పిల్లలను ఉగ్రవాదంలో చేరనివ్వకండి’

9 Mar, 2019 13:34 IST|Sakshi

కశ్మీర్‌ తల్లులకు భారత ఆర్మీ విజ్ఞప్తి

జమ్మూ : ‘కశ్మీర్‌లోని ప్రతి తల్లిని వేడుకుంటున్నా.. మీ పిల్లలను దయచేసి ఉగ్రవాదం వైపు వెళ్లనివ్వకండి’ అని భారత ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ కాన్వాల్‌ జీత్‌ సింగ్‌ ధిలాన్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఉగ్రవాదానికి ప్రభావితమై.. వారి ఉచ్చులో చిక్కుకున్నవారు.. తిరిగి రావాలనుకుంటే వారికి భారత ఆర్మీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘నేను ప్రతి తల్లిని వేడుకుంటున్నా. హింసను ప్రేరేపిస్తూ అమయాకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదం వైపు మీ పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోండి. ఇప్పటికే ఎవరైనా అలా చేరి.. తిరిగి రావాలంటే చెప్పండి. వారికి భారత సైన్యం అండగా ఉంటుంది. వారికి సాధారణ జీవితంలోకి తీసుకురావాడానికి కృషి చేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు.

ఆర్మీ పాసింగ్‌ పరేడ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన 152 మంది యువకులు భారత సైన్యంలో చేరారాని పేర్కొన్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం భావోద్వేగంగా మాట్లాడిన ధిలాన్‌.. తుపాకులతో తిరిగే యువకులను లొంగిపోవాలని, లేకుంటే కాల్చేస్తామని హెచ్చరించారు. అలాగే కశ్మీర్‌ సమాజంలో తల్లికి ఎంతో బాధ్యత ఉంటుందని, ఎవరైతే ఉగ్రవాదులతో చేయికలిపారో అలాంటి వారి తల్లులు ఒక్కసారి వారిని పిలిపించే ప్రయత్నం చేయాలని ఉగ్రవాదం వీడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు