నేపాల్‌తో మా బంధం బలంగానే ఉంటుంది: ఎమ్‌ఎమ్‌ నారావనే

13 Jun, 2020 14:15 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ ముకుంద్ నారావనే తెలిపారు. చైనాతో కార్ప్స్‌ కమాండర్‌ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతోనూ మీటింగ్‌లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ డెహ్రాడూన్‌లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న ఎమ్‌ఎమ్‌ నారావనే మీడియాతో మాట్లాడారు. నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందన్నారు. అలానే ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంపై నేపాల్‌తో ఇటీవల జరిగిన సరిహద్దు వివాదాల గురించి ఆయన మాట్లాడుతూ... ‘మనకు నేపాల్‌తో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మత సంబంధాలు ఉన్నాయి. నేపాల్‌-భారత్‌ ప్రజల మధ్య మంచి బంధం ఉంది. ఆ దేశ ప్రజలతో మా సంబంధం ఇప్పుడు, ఎల్లప్పుడూ బలంగానే ఉంటుంది’ అన్నారు.(కాలాపానీ కహానీ)

నివేదికల ప్రకారం, గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్‌, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరటాలు జరుగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. గల్వాన్ వ్యాలీలోని డార్బుక్-షాయోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారిని అనుసంధానించే మరో రహదారిని నిర్మించడంతో పాటు.. పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో భారత్‌ మరో కీలక రహదారిని నిర్మిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలని చైనా వ్యతిరేకిస్తుంది. అలానే భారతదేశానికి ఆమోదయోగ్యం కాని ఫింగర్ ప్రాంతంలో చైనా కూడా రహదారిని నిర్మించింది. (‘భారత్‌ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’)

3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఏసీ వెంబడి భారతదేశం-చైనా సరిహద్దు వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా చైనా పేర్కొంటుండగా, భారత్ వ్యతిరేకిస్తోంది. సరిహద్దు సమస్యకు సంబంధించి అంతిమ పరిష్కారం ఇంకా పెండింగ్‌లో ఉన్నందున.. సరిహద్దు ప్రాంతంలో ఇరు పక్షాలు శాంతితో మెలగాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు