అరుణ్‌ జైట్లీ పెన్షన్‌... వాళ్లకే ఇవ్వండి!

1 Oct, 2019 09:08 IST|Sakshi

న్యూఢిల్లీ : దివంగత బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అరుణ్‌ జైట్లీ పెన్షన్‌ తమకు వద్దని చెప్పిన ఆయన భార్య సంగీత జైట్లీ.. ఆ డబ్బును రాజ్యసభ దిగువ తరగతి సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరారు. అరుణ్‌ జైట్లీ ఉదారత, సేవాగుణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. అరుణ్‌ జైట్లీ పేరిట తనకు వచ్చే నెలవారీ పెన్షన్‌ రూ. 25 వేల మొత్తాన్ని రాజ్యసభ నాలువ తరగతి ఉద్యోగులకు అందజేయాలని కోరారు. 

కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా, బీజేపీ ట్రబుల్‌ షూటర్‌గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అరుణ్‌ జైట్లీ ఆగష్టు 24న కన్నుమూసిన విషయం విదితమే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక అరుణ్‌ జైట్లీ సేవా గుణాన్ని చాటుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే వారన్న విషయం తెలిసిందే. వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన.. తన వద్ద పనిచేసిన ఎంతో మంది సిబ్బంది పిల్లలను ఉచితంగా చదివించారు. అదే విధంగా 2018లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం అరుణ్‌ జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన సమయంలో.. అక్కడి రోగుల ఇబ్బందిని గమనించి వాటర్‌ కూలర్స్‌, డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ దానం చేశారు. కాగా అనారోగ్య కారణాల కారణంగా రెండోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టలేనని ప్రధాని మోదీకి జైట్లీ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు