ట్రంప్‌ పర్యటన : కేజ్రీవాల్‌కు అవమానం..!

22 Feb, 2020 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఆహ్వానం అందలేదు.

భారత్‌ పర్యటనలో భాగంగా ఈ నెల 25న మెలానియా ట్రంప్‌ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే ‘ హ్యాపీనెస్‌ క్లాస్‌’ గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే మెలానియా ట్రంప్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలు వచ్చాయి. కాగా, కేజ్రీవాల్‌కు కానీ, మనీష్ సిసోడియాలకు కానీ అలాంటి ఆహ్వానం ఏమీ లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఢిల్లీ సీఎంను పక్కనపెట్టిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్‌ మండిపడింది. మెలానియా ట్రంప్‌ కార్యక్రమానికి  తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్‌ గురించి బెబుతాయని ప్రీతిశర్మ మీనన్ ట్వీట్‌ చేశారు. 

(చదవండి : ట్రంప్‌కి విందు: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం!)

ఇక ఆప్‌ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆప్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేత సంబిత్ పత్రా విమర్శించారు.‘కొన్ని విషయాలపై రాజకీయాలు చేడయం సరికాదు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం ప్రారంభింస్తే భారతదేశం అపఖ్యాతి పాలవుతుంది. భారత్‌ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు. ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆ దేశం చేతుల్లో ఉంది. దీనిపై రాజకీయాలు చేయడం మంచిది కాదు’ అని సంబిత్‌ అన్నారు. 

(చదవండి : ట్రంప్‌ వెంటే ఇవాంకా..)

కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం(ఫిబ్రవరి 24) భారత్‌కు చేరుకుంటారు. వాషింగ్టన్‌ నుంచి ట్రంప్‌ నేరుగా అహ్మదాబాద్‌ వస్తారు. అక్కడ మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్‌ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్‌ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్‌ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్‌ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్‌ భవన్‌లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు