మహాభారతం నిజంగా జరిగిందా?

2 Nov, 2017 10:54 IST|Sakshi

నిగ్గుతేల్చేందుకు సిద్ధమైన పురాతత్వ శాస్త్రవేత్తలు

మహాభారతం.. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత విలువైనది. ఇది కల్పన అని కొం‍దరు.. కాదు వాస్తవం అని మరికొందరు.. దశాబ్దాలనుంచి వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.

మీరట్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ ప్రాంతం దగ్గర పాండవులు నివసించి లక్షాగృహం ఉందని కొన్నేళ్లుగా వాదనలు ఉన్నాయి. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని పురాతత్వ శాస్త్రవేత్తలు, స్థానిక చరిత్రకారుల అభ్యర్థనల మేరకు.. ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (భారత పురావస్తు శాఖ పరిశోధనా సంస్థ) తవ్వకాలకు అనుమతులు మం‍జూరు చేసిం‍ది. లక్షాగృహం ఉందని భావిస్తున్న ప్రాంతం.. ఉత్తర ప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ జిల్లాలోని బర్నవా ప్రాంతంలో ఉంది.

బర్నవా ప్రాంతంపై మాజీ పురాతత్వ శాఖ ఉన్నతాధికారి కేకే శర్మ మాట్లాడుతూ.. ఇక్కడ లక్షాగృహం ఉందనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మహాభారాతాన్ని మలుపు తిప్పడం‍లో లక్షాగృహానిది కీలక పాత్ర అని ఆయన చెప్పారు. బర్నావా ప్రాంతాన్నే మహాభారతంలో వరుణవిరాట్‌ అని పిలుస్తారని చెప్పారు.

బర్నవా ప్రాంతంలో తవ్వకాలు జరపాలని ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నుంచి ఆదేశాలు అందాయని.. అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ, పురావస్తు తవ్వకాల శాఖ సంయుక్తంగా పరిశోధనలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్‌ నెల మొదటి వారంలో తవ్వకాలను మొదలు పెడతామని ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (తవ్వకాల విభాగం) డైరెక్టర్‌ జితేందర్‌ నాథ్‌ తెలిపారు.

దీనిపై ఇప్పుడే ఎటువంటి ప్రకటన చేయడం సముచితం కాదని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌కే ముంజాల్‌ తెలిపారు. చండయాన్‌ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న సమయంలో ఎరుపురాయితో కూడిన పూసలు, రాగి కిరీటం బయటపడిందని ఆయన చెప్పారు. ఈ కిరిటాన్ని స్థానిక పురావస్తు శాఖ అధికారి అమిత్‌ రాయ్‌ కనుగొన్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో బురదతో కూడిన పెద్ద నీటి మడుగు, దాని కింద భారీ సొరంగం ఉన్నాయని అమిత్‌ రాయ్‌ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ సొరంగం ద్వారానే పాండవులు లక్షాగృహం నుంచి తప్పించుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎస్‌కే ముంజాల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు