కర్ణాటకలో అసోం యువకుడి హత్య

7 Jul, 2015 18:04 IST|Sakshi

మంగళూరు: కూలీ పనుల నిమిత్తం కర్ణాలకకు వలస వచ్చిన ఓ అసోమీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పనులకు ఎంత కూలీ తీసుకోవాలనే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విబేధాలే హత్యకు దారితీశాయని పోలీసులు చెప్పారు.

అసోంకు చెందిన మహేంద్రరాజ్ బొన్సి (22) తన బంధువులతో కలిసి ఉడిపి జిల్లాలోని శిరూరు, ముద్దుమనే గ్రామాల్లో నిర్మాణం పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, వలస కూలీలు తక్కువ కూలీకే పనులు చేస్తుండటంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని స్థానిక కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. సోమవారం ఓ చోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు ఇరువర్గాలు.

అయితే ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన ప్రత్యర్ధులు.. అస్సామీ కూలీల ప్రతినిధులపై కర్రరతో దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, తీవ్రగాయాలపాలైన మహేంద్రరాజ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు