ఆయన ఓ హిందువు కాబట్టే...

21 Aug, 2017 19:07 IST|Sakshi
హైదరాబాద్‌: మాలెగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కున్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై  ఎంఐఎం పార్టీ అధినేత‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. కేవలం హిందువు అయిన కారణంగానే పురోహిత్‌కు బెయిల్‌ లభించిందని ఒవైసీ వ్యాఖ్యానించారు. 
 
‘ప్రధాని నరేంద్ర మోదీ హిందూ నేరస్థులపై సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందుకే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న పురోహిత్‌కు బెయిల్‌ దక్కింది’ అని ఒవైసీ తెలిపారు. హైదరాబాద్‌ లో ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పటి పలు కేసుల్లో హిందువులు మాత్రమే బయటకు వస్తున్నారని చెప్పారు. బెయిల్‌ అనేది ఇండియాలో ఉన్న ప్రతీ పౌరుడి హక్కు అని, కానీ, ముస్లిం, దళిత మరియు గిరిజన ప్రజలకు మాత్రం అది దక్కటం లేదని ఒవైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టెర్రిరిజం మతం నుంచి పుట్టదన్న ఆయన, కొందరు దానిని మతానికి ఆపాదిస్తున్నారని  చెప్పుకొచ్చారు. పురోహిత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఆయనకు నిర్దోషిగానే పరిగణింపబడుతున్నారని ఒవైసీ చెబుతున్నారు. 
 
కాగా, బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చి సుప్రీంకోర్టు పురోహిత్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ కుట్రలో పురోహిత్‌ బలయ్యారంటూ ఆయన తరపున హరీశ్‌ సాల్వే బలమైన వాదనలు వినిపించారు. వాదనతో ఏకీభవించిన కోర్టు 9 ఏళ్ల అనంతరం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, 2008 మాలెగావ్‌ పేలుళ్లలో నలుగురు మృత్యువాత పడగా, 79 మంది గాయపడ్డారు. ఆ సమయంలో పురోహిత్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, సాధ్వీ ప్రగ్యాతోపాటు నిందితుడిగా  పురోహిత్‌ ఆరోపణలు ఎదుర్కున్నారు. 
 
పురోహిత్‌ ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ వాది: దిగ్విజయ్‌
 
మాలెగావ్‌ కేసులో నిందితులను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. పురోహిత్‌ కూడా ఆ వర్గానికి చెందిన వారే. అందుకే ఆయనకు బెయిల్‌ లభించిందని దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఆయన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిరణ్‌ రిట్జూ మీడియాకు తెలిపారు.
మరిన్ని వార్తలు