ఐఐటీలో మూడున్నరేళ్లకే బీటెక్‌ కంప్లీట్‌!

19 Dec, 2016 22:18 IST|Sakshi
ఐఐటీలో మూడున్నరేళ్లకే బీటెక్‌ కంప్లీట్‌!

కాన్పూర్‌: సాధారణంగా ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ కావాలంటే నాలుగేళ్లు పడుతుంది. విద్యార్ధులు కాస్త అలసత్వం ప్రదర్శిస్తే మరికొన్నేళ్లు అదనంగా పట్టే అవకాశం కూడా ఉంది. అలాంటిది ప్రతిష్టాత్మక ఐఐటీలో బీటెక్‌ చేస్తున్న ముగ్గురు విద్యార్ధులు తమ కోర్సును మూడున్నరేళ్లకే కంప్లీట్‌ చేశారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్‌లలో కంప్లీట్‌ కావాల్సిన కోర్సును ఏడు సెమిస్టర్‌లలోనే ఫినిష్‌ చేశారు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన వారు కాన్పూర్‌ ఐఐటీ విద్యార్థులు.

అలాగే అక్కడ బీటెక్‌, ఎంటెక్‌ కలిసి ఉండే డ్యూయల్‌ డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు తమ కోర్సును నాటుగున్నరేళ్లకే కంప్లీట్‌ చేశారు. వాస్తవానికి ఈ కోర్సు 10 సెమిస్టర్‌లలో పూర్తి కావాల్సి ఉండగా 9 సెమిస్టర్‌లలోనే వీరు కంప్లీట్‌ చేశారు. కోర్సు తొందరగా పూర్తి చేయడానికి ఈ ఐదుగురు విద్యార్థులు చాలా కష్టపడ్డారని కాన్పూర్‌ ఐఐటీ సెనేట్‌ మెంబర్స్‌ మీటింగ్‌లో ప్రశంసలు కురిపించారు. ఈ ఐదుగురు విద్యార్ధులు 2017లో జరిగే కాన్వకేషన్‌ సెరిమొనిలో డిగ్రీలు అందుకోనున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు