ఈసారి డాన్సు చేయలేకపోయాం: ఒబామా

27 Jan, 2015 11:11 IST|Sakshi
ఈసారి డాన్సు చేయలేకపోయాం: ఒబామా

న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్లో ఒబామా స్ఫూర్తిమంతంగా ప్రసంగించారు. నమస్తే , బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఏమన్నారంటే..

ఇంతకుముందు మేం ముంబైలో పిల్లలతో కలిసి డాన్సు చేశాం. దురదృష్టవశాత్తు ఈసారి డాన్సు చేయలేకపోయాం. మిషెల్ మంచి డాన్సర్ అని అందరూ అంటారు. ఇంతకుముందు వైట్ హైస్ లో దీపావళి చేసుకున్నాం.

మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే పోరాటం చేసినట్లు మార్టిన్ లూథర్ కింగ్ చెప్పారు. అహింస అత్యంత శక్తిమంతమైన ఆయుధం. గాంధీ చెప్పిన ఈ విషయం మనందరికీ ఆచరణీయం. భారతీయులు, అమెరికన్లు అంతా సమానమే.

వందేళ్ల క్రితం స్వామి వివేకానంద అమెరికాకు వచ్చి స్ఫూర్తిమంతమైన ప్రసంగం చేశారు. ఆయన మా సొంత నగరం చికాగో వచ్చారు. ఆయన ప్రసంగాన్ని అమెరికాలోని సోదర సోదరీమణులారా అని ప్రారంభించారు. ఇప్పుడు నేనూ భారత్ లోని సోదర సోదరీమణులారా అని అంటున్నాను. ఆయన హిందూత్వాన్ని, దాని శక్తిని ప్రపంచానికి చాటారు.

వలసవాదాన్ని తరిమికొట్టడానికి మనమంతా పోరాడాం. భారత యూఎస్ సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.

టెక్నాలజీ శక్తి మీ సొంతం. దాని పుణ్యమాని మనం ఫేస్బుక్, ట్విట్టర్.. వీటి సాయంతో ప్రంపచంలో అందరినీ కలవగలుగుతున్నాం. 30 లక్షల మంది భారతీయులు అమెరికాను బలోపేతం చేస్తున్నారు. వాళ్లంతా చాలా గర్వకారణం.

భారత్, అమెరికా కేవలం భాగస్వాములే కారు.. అద్భుతమైన భాగస్వాములు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా భారతదేశం ఉంది.

నన్ను రెండోసారి భారతదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అమెరికా- ఇండియా కలిస్తే ఏదైనా సాధించవచ్చు, ఎంత పెద్ద విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు.

పేదరికాన్ని తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం సౌర విద్యుత్తు లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

అణ్వస్తాలు లేని ప్రపంచాన్ని మనం చూడగలగాలి. అందుకోసం మనమంతా కలిసి కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలు, తీరప్రాంత భద్రత ఇవన్నీ అత్యంత ముఖ్యం.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా చూడాలని నేను అనుకుంటున్నాను. అందుకు నా పూర్తి మద్దతు ఉంటుంది.

ఎన్నికల రంగంలో మీకున్న అనుభవం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు ఇతర దేశాలకు కూడా ఉపయోగపడాలి. బర్మా, శ్రీలంక లాంటి దేశాలకు మీ సాయం అవసరం. మంచి వాక్సిన్లు కనిపెట్టారు, ఔషధ రంగంలో కూడా మీ అనుభవం అపారం.వైద్య మేథోశక్తితో ప్రపంచ దేశాలకు ఎంతో సాయం చేయచ్చు.

మీ లాంటి యువతరమే స్వచ్ఛమైన ఇంధనం కోసం పోరాడాలి. ఈ భూమిని కాపాడుకోవాల్సింది మీరే.

అమెరికాలాగే పేదరిక నిర్మూలనకు భారత్ కృషిచేస్తోంది.

భారతదేశంలోను, అమెరికాలోను అనేక జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, అన్నీ ఉన్నాయి. మీ రాజ్యాంగం, మా రాజ్యాంగం కూడా ఒక్కలాంటివే.

మా తాతగారు బ్రిటిష్ సైన్యంలో వంటవాడిగా పనిచేసేవారు. మేం పుట్టినప్పుడు నల్లజాతి వాళ్లకు ఓటుహక్కు కూడా ఉండేది కాదు. నా చర్మం రంగు కారణంగా అసలు ఇంత ఎత్తు ఎదగగలనా అన్న అనుమానం చాలామందికి ఉండేది.

ఇప్పుడు ఇక్కడ ఒకళ్లు ఆటో నడుపుతుంటారు, మరొకరు ఇంట్లో పనిచేసుకుంటారు, వాళ్లకూ ఆశలు.. ఆకాంక్షలు ఉంటాయి. ప్రస్తుతానికి కడు పేదరికంలో మగ్గిపోతున్నా.. వాళ్ల పిల్లలకు అద్భుతమైన అవకాశాలు రావడం ఖాయం. ఓ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకు ప్రధానమంత్రి కావడమే ఇందుకు నిదర్శనం.

ప్రతి ఒక్కరికీ అవకాశాలున్నాయి. తమ కలలను నిజం చేసుకోడానికి కష్టపడాలి. భారతదేశంలో మహిళా శక్తి అపారం. నా భార్య మిషెల్ చాలా గొప్పవ్యక్తి. మహిళల సమానత్వం కోంస అమెరికా కృషి చేస్తోంది. నాకు ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. వాళ్లకు స్వేచ్ఛ ఉంది.

మహిళలు విజయాలు సాధిస్తే దేశం విజయాలు సాధిస్తుంది. మహిళలను ఎలా ట్రీట్ చేస్తారన్నదాన్ని బట్టే విజయాలు ఆధారపడి ఉంటాయి. మగాళ్ల కంటే కూడా ఆడవాళ్లు బాగా చదువుకుంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో ఏవైనా దేశాలు వెనకబడ్డాయంటే, మహిళాశక్తిని నిర్లక్ష్యం చేయడం వల్లే. మనమంతా కూడా మహిళలను పూర్తిస్థాయిలో గౌరవించాలి. వాళ్ల గౌరవాన్ని కాపాడే బాధ్యత సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా మనమీదే ఉంటుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో నారీశక్తి నన్ను ఎంతగానో ఆకర్షించింది.

హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, యూదులు.. అంతా ఉంటారు. కానీ అంతా ఒకే చెట్టుకు ఉన్న వేర్వేరు కొమ్మల్లాంటివాళ్లే. మతస్వేచ్ఛ దేశానికి చాలా ముఖ్యం. మన రెండు దేశాల్లోనూ ఇది ఉంది. ఎలాంటి భయం లేకుండా తమ మతాన్ని అవలంబించడానికి, ప్రచారం చేసుకోడానికి వీలుండాలి. అమెరికాలో విస్కాన్సిస్ గురుద్వారా మీద దాడి జరగడం దురదృష్టకరం. షారుక్ ఖాన్, మిల్కాసింగ్.. ఇలా ఎవరైనా విజయాలు సాధించగలరు. కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు.

భారతదేశంలో చాలామంది 35 ఏళ్లలోపు వాళ్లే. మీలాంటి యువతే ఈ దేశ భవిష్యత్తు. ఏదేశంలోనైనా మీవల్లే బంగార భవిష్యత్తు సాధ్యం అవుతుంది. మీ కలలను సాకారం చేసుకునేందుకు అన్నిచోట్లా అవకాశం ఉంది. మీకు సరైన శిక్షణ ఇస్తేచాలు. ఇందుకోసం మన దేశాల్లోని యూనివర్సిటీలు, ఐఐటీలు, కాలేజీల మధ్య సహకారాన్ని మరింత పెంచుదాం. అమెరికా విద్యార్థులు భారత్ రావాలి, భారత విద్యార్థులు అమెరికా రావాలి. మనం ఒకరినుంచి మరొకరు నేర్చుకోవాలి. మవాళ్లు మిమ్మల్ని చూసి కష్టపడే తత్వం నేర్చుకోవాలి.

భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. మేం గతంలో వచ్చినప్పుడు కొంతమంది కార్మికులను కలిశాం. వాళ్ల పిల్లలను చూశాం. వాళ్ల ముఖాలమీద నవ్వు మెరిసిపోతోంది. అతడి పేరు విశాల్. ఇప్పుడు అతడి వయసు 16 ఏళ్లు. ఢిల్లీలో బాగా చదువుకుంటున్నాడు. అందుకు కారణం అతడు స్కూలుకు వెళ్లడమే. విశాల్ భారత సైన్యంలో చేరదామని అనుకున్నాడు. విశాల్ లాంటి లక్షలాది మంది వాళ్లకు మనం చదువుకునే అవకాశాలు కల్పించాలి.

భారతదేశ భవిష్యత్తు మీద నేను చాలా ఆశాభావంతో ఉన్నాను. రెండు దేశాల్లోను ఎన్నికలు జరిగాయి. గత తరాలు కనీసం ఊహించలేని స్థాయిలో అభివృద్ధి సాధించాం. మానవహక్కులను గౌరవించాం. మనకు కలలున్నాయి, వాటిని సాకారం చేసుకుంటున్నాం.

మనమంతా ఒకే చెట్టుకు పూసిన అందమైన పువ్వులం. మేం మీ స్నేహితులుగా ఉండాలని, భాగస్వాములుగా ఉండాలని అనుకుంటున్నాం. జైహింద్..
 

మరిన్ని వార్తలు