‘కూర్గ్‌’ సొగసు చూడతరమా!

23 May, 2018 13:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని ‘కూర్గ్‌’ పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. పలు రకాల పూల సమ్మిళిత సువాసనలు. రకరకాల కాఫీ గింజల గుబాళింపులు ముక్కు పుటాలను అదరగొడతాయి. ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందమైన పచ్చిక బయళ్లు, గుబురైన చెట్ల సముదాయంతో బారులు తీరిన పర్వత శ్రేణులు, వాటి మధ్యనుంచి జాలువారే జలపాతాలు, కొమ్మ కొమ్మకు పలకరించే పక్షుల కిలకిలారావాలు. వన్య ప్రాణుల అలజడి మదిలో మెదులుతాయి. ఇదంతా వినడం వల్లనే, చదవడం వల్లనే మనలో కలిగే అనుభూతి. ఇక ప్రత్యక్షంగా వీక్షిస్తేనా....? ఆ అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికి వారు ఆ అనుభూతిని అనుభవించి పరవశించాల్సిందే. అందుకే కూర్గ్‌ను ‘స్కాట్‌లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని అభివర్ణించారేమో!

పర్యాటకులు కూడా పలు రకాలుగా ఉంటారు వయసురీత్యా, అభిరుచుల రీత్యా. కొందరికి చెట్టూ పుట్టలు పట్టుకొని ట్రెక్కింగ్‌ చేయడం, సుడులు తిరిగే సన్నటి నదీ పాయలో రాఫ్టింగ్‌ చేయడం, పారా గ్లైడింగ్‌ చేయడం, పారా జంపింగ్‌ చేయడం, బోటింగ్‌ చేయడం, రోప్‌వేలో ప్రయాణించడం ఇష్టం. లగ్జరీ రిసార్టుల్లో ఇవి అందుబాటులో ఉన్నా అంత డబ్బు వెచ్చించని వారికి అందుబాటులో ఉండవు. మరికొందరికి ప్రశాంత వాతావరణం ఇష్టం. కంటి ముందు కనిపించే కొండ కోనల్ల నుంచి వచ్చే చల్లటి, స్వచ్ఛమైన గాలులను ఆస్వాదించడం, దట్టమైన చెట్ల మధ్య నుంచి కాలిబాటన కాస్త దూరం ప్రయాణించడం, జలపాతాలను ఆస్వాదించడం, పక్షలు, వన్య సంరక్షణ ప్రాంతాలను సందర్శించడం వారికీ హాబీ.

డబ్బును దండిగా ఖర్చు పెట్టే వారి కోసం కూర్గ్‌ రాజధాని మడికరి ప్రాంతంలో పలు లగ్జరీ రిసార్టులుండగా, రెండో కేటగిరీ వాళ్ల కోసం కూర్గ్‌లోని కుట్టా ప్రాంతంలో సరైన కాటేజీలు ఉన్నాయి. మడికేరి ఏడు కిలోమీటర్ల  దూరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ‘అబే’ జలపాతం ఉండగా, కుట్టాకు సమీపంలో రెండవ అతిపెద్ద జలపాతం ‘ఇరుప్పు’ ఉంది. అబే జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుండగా, ఇరుప్పు ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉండగా, ట్రెక్కింగ్‌ చేసే కుర్రకారు కోసం నిటారైన కొండ ఉండనే ఉంది.

ఇరుప్పు జలపాతం సమీపంలో పర్యాటకులు ఉండేందుకు పలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కొండ దిగువ ప్రాంతంలో ఉండగా, పూర్తిగా కొండ ఎగువున ‘ట్రాపికల్‌ బూమ్స్‌’ అనే కాటేజీ కొత్తగా వెల్సింది ఆకర్షణీయంగానే కాకుండా, అందుబాటు ధరల్లో ఉంది (ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు 9449118698 మొబైల్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు). ఎక్కడికి వెళ్లనవసరం లేకుండానే ఈ క్యాటీజీ వసారాలో కూర్చొని ఆవలి కొండలను, కొండలను కౌగలించుకునే మబ్బులను, ఎప్పుడూ కురిసే మంచు ముత్యాలను చూడవచ్చు.

ఈ కాటేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ‘ఇరుప్పు’ వాటర్‌ ఫాల్స్‌ ఉండగా, పది కిలోమీటర్ల దూరంలో నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్, అంతే దూరంలో తోల్‌పట్టి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. కాఫీ గింజల సువాసనలు, పూల గుబాళింపులు ఎల్లప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. రుతువులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూర్గ్‌ను సందర్శించవచ్చు. ఒక్కో రుతువులో ఒక్కో రకమైన అనుభూతిని పొందవచ్చు. నిండైన వాగులు, వంకలతోపాటు పచ్చదనం ఎక్కువగా ఉండే ‘సెప్టెంబర్‌ నుంచి మార్చి’ మధ్యలో సందర్శించడం మరీ బాగుంటుంది.

మరిన్ని వార్తలు