గ్రామీణ మౌలిక అభివృద్ధికి ముందడుగు

29 Feb, 2016 18:44 IST|Sakshi

ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పడటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు రైతులకు వ్యవసాయ రుణాలకు అత్యధికంగా 9 లక్షల కోట్లు, ఎంఎన్ ఆర్ ఈజీఏ కి అత్యధికంగా 38,500 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు.

బడ్జెట్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకానికి 19,000 కోట్లు కేటాయించడం.. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముందడుగు వేసినట్లేనంటూ రాజ్ నాథ్.. అరుణ్ జైట్లీ బడ్జెట్ ను అభినందించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలంగా ఉందని,  గ్రామీణాభివృద్ధికి  పెద్దపీట వేసిందని అన్నారు. అంతేకాక రహదారుల అభివృద్ధికి 55 వేల కోట్లు కేటాయించడం  స్వాగతించదగ్గ విషయమన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులతోపాటు, రైల్వేలో మూలధన వ్యయం కలిపి 2.2 లక్షల కోట్లు అధిగమిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలిపారు.

ఈ ఏడు బడ్జెట్ ముఖ్యంగా పేదల పెన్నిధిగా ఉందని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు.  గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 2,87,000 కోట్లు కేటాయించడం పంచాయితీరాజ్ సంస్థల బలోపేతానికి దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని అన్నారు. తయారీ రంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రయోజనాలు కల్పించిందని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా