మద్యనిషేధం సంపూర్ణం కాదు.. పాక్షికమే

19 Dec, 2015 08:28 IST|Sakshi
మద్యనిషేధం సంపూర్ణం కాదు.. పాక్షికమే

బిహార్‌లో మద్యనిషేధం ప్రస్తుతానికి సంపూర్ణం కాదు.. పాక్షికమేనని తేలిపోయింది. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్కడ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని తొలుత ప్రకటించిన నితీష్ కుమార్ సర్కారు.. ప్రస్తుతానికి సారాను మాత్రమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని, ప్రస్తుతానికి ఏప్రిల్ తర్వాత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)ను ప్రభుత్వ దుకాణాల్లో మాత్రమే విక్రయిస్తామని ప్రకటించింది.

ఏప్రిల్ 1 నుంచి సారా అమ్మకాల మీద సంపూర్ణ నిషేధం ఉంటుందని సీఎం నితీష్ కుమార్ కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. ఆ తర్వాత బిహార్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పరిమితంగా మాత్రమే మద్యం దుకాణాలు నడిపిస్తామని, వాటిలో ఐఎంఎఫ్ఎల్ మాత్రమే అమ్ముతారని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 90 శాతం వరకు మూతపడతాయి. మరింత ప్రభావవంతంగా ఉండేందుకే దశలవారీ మద్యనిషేధాన్ని అమలుచేస్తున్నామన్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల మీద రాష్ట్రానికి రూ. 5వేల కోట్ల ఆదాయం వస్తోందని, సమాజ ప్రయోజనాల కోసం అది పోయినా తాను బాధపడేది లేదని నితీష్ అన్నారు.

మరిన్ని వార్తలు