‘బాలాకోట్‌’ దాడులపై మళ్లీ అనుమానాలు

24 Sep, 2019 14:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి భారత వైమానికి దళం చొచ్చుకుపోయి ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఉగ్రవాదులు ఇటీవల పునుద్ధరించుకున్నారని భారత సైనిక చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అసలు ఆ రోజున ఉగ్రవాదుల శిబిరం ఏ మేరకు ధ్వంసమయింది? అన్న అనుమానం నేడే కాదు, దాడులు జరిగిన రోజే కలిగాయి. అంతకుముందు, ఆ తర్వాత అంతర్జాతీయ శాటిలైట్లు తీసిన చిత్రాలను కూడా కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్లు ఉదహరిస్తూ భారత వైమానిక దళం దాడులు గురితప్పాయని ఆరోపించాయి. ఆ ఆరోపణలను, ఆ విమర్శలను భారత ప్రభుత్వ వర్గాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి.

తాజాగా చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా అకాడమీలో బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ నాడు భారత ధ్వంసం చేసిన ఉగ్రవాదుల శిబిరాన్ని వారు మళ్లి పునరుద్ధరించుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పడం ఎంత మేరకు నిజం? పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బపడిందని, బాలాకోట్‌లోని వారి శిబిరాన్ని సమూలంగా నాశనం చేశామంటూ నాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంలో నిజం లేదా? ఈ రెండు నిజం అవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఒక్కటే నిజం కావాలి? 2016లో భారత సైనికులు పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా టెర్రరిస్టు లాంఛింగ్‌ పాడ్‌లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అప్పుడు కూడా సైనిక వర్గాలుగానీ, ప్రభుత్వ వర్గాలుగానీ అందుకు సరైన సాక్ష్యాలు చూపించలేక పోయాయి.  

మళ్లీ ఈసారి కూడా బాలాకోట్‌ లాంటి దాడులు జరిపి భారత సైనిక వర్గాలు నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్‌ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్‌ సరిహద్దుల్లో పాక్‌ సైనిక భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క కశ్మీర్‌ మిలిటెంట్లు ఉగ్రదాడులకు అవకాశాలు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్‌ సర్జికల్‌ దాడులు నిర్వహించలేదు. (చదవండి: బాలాకోట్‌ ఉగ్రశిబిరం మొదలైంది)

మరిన్ని వార్తలు