నరేంద్ర మోదీకి ప్రతికూల అంశాలు

14 Mar, 2019 19:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాలకపక్ష బీజేపీకి రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బాలకోట్‌పై భారత వైమానిక దాడులు, జాతీయవాదంతోపాటు మిత్రపక్షాలతో పొత్తులు కలసివచ్చే అంశాలే అయినప్పటికీ పలు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 2018, అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికం నాటికి గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోవడం, ఏడాదికి రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోక పోవడం తీవ్రమైన అంశాలు. వ్యవసాయం రైతుల పెట్టుబడి ఒకప్పటికన్నా రెండింతలు పెరిగినా ఆదాయ వృద్ధి రేటు పడిపోవడం, నిరుద్యోగ సమస్య గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.7 శాతానికి పెరిగిపోవడం అంటే ‘మూలిగే నక్కపై తాటి పండు పడటమే’.

ఘోర వైఫల్యం..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఘోరమైన వైఫల్యం. ఈ వైఫల్యాన్ని ప్రధానంగా ఎత్తి చూపడానికే లోక్‌సభ సీట్లలో 33 శాతం టిక్కెట్లను తాము మహిళలకు ఇస్తున్నామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతా దళ్‌ ప్రకటించింది. దీనికి పోటీగా తాము 40 శాతం టిక్కెట్లు మహిళలకు ఇస్తున్నామని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది.

చదవండి : మమతా బెనర్జీ సంచలన నిర్ణయం

ఇక పెద్ద నోట్ల రద్దు వల్ల పలు రాష్ట్రాల్లో యువత, ముఖ్యంగా గ్రామీణ యువత ఉపాధిని కోల్పోవడం, బీహార్‌లో ఇసుక మైనింగ్‌పై నిషేధం విధించడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోవడం మోదీకి ప్రతికూల అంశాలే. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుగల స్త్రీలను అనుమతించడం పట్ల సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలు చేసిన ఆందోళన కలసి వస్తుందనుకుంటే అది కూడా బెడిసికొట్టింది. మరోవైపు కేరళలో ఎల్‌డీఎఫ్‌ దూసుకుపోతోంది. అదే విధంగా మార్కెట్లో కూరగాయలు, బెల్లం ధర పెరిగిపోవడం, రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశాలు ఉండడం కూడా బీజేపీకి ప్రతికూల అంశాలే.

మరిన్ని వార్తలు