రహస్యాలను బయటపెడతాం.. 'మోస్ట్ వెల్‌కం'!

4 May, 2016 15:08 IST|Sakshi
రహస్యాలను బయటపెడతాం.. 'మోస్ట్ వెల్‌కం'!

వీవీఐపీ కుంభకోణంపై రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ: వీవీఐ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య పార్లమెంటులో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ దుమారం రేపుతున్న ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్‌ చేసుకొని అధికార పక్షం విమర్శల దాడిని ముమ్మరం చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం, అవినీతికి పాల్పడిన అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ తీరుపై బుధవారం రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న రూ. 3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం క్రోనాలజీని (కాలక్రమాన్ని) సభకు తెలియజేస్తానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రతిపాదించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఇందుకు నిరాకరించారు.

అనంతరం బీజేపీ సభ్యుడు భూపేంద్ర యాదవ్ చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కురిపించారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగేందుకు వీలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం దొడ్డిదారి ఎంట్రీని ఇచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. ఆ స్కాంలో దోషులకు వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వం చర్య ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ కౌంటర్ ఇస్తూ అధికార పక్షం సరైన ఆధారాలు లేకుండానే తమపై ఆరోపణలు చేస్తున్నదని, ఈ విషయంలో ఇటలీ కోర్టు ప్రస్తావించిన అంశాలు తాము నమ్మబోమని పేర్కొన్నారు. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని రద్దు చేసింది యూపీఏ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

మోస్ట్ వెల్‌కమ్‌: సోనియా
వీవీఐపీ స్కాంకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రక్షణమంత్రి మనోహర్ పారికర్ బుధవారం రాజ్యసభ ముందు ఉంచుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ స్కాంకు సంబంధించిన రహస్యాలన్నింటినీ బయటపెడతామని బీజేపీ వర్గాలు పేర్కొనగా.. ఈ వార్తలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 'మోస్ట్ వెలకమ్‌' అంటూ స్పందించారు. ఈ అంశంలో అన్ని విషయాలను బయటపెట్టాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు