కేరళ సర్కారు తీరేం బాగోలేదు

21 Nov, 2018 02:27 IST|Sakshi
18 మెట్లు ఎక్కి పైకొస్తున్న చిన్నారికి సాయంచేస్తున్న పోలీసు

శబరిమలలో పరిణామాలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా

న్యూఢిల్లీ/తిరువనంతపురం: శబరిమల వ్యవహారంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం తీరు నిరుత్సాహపూరితంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. అమిత్‌ మంగళవారం ట్విట్టర్‌లో..‘అయ్యప్ప భక్తులు ఆలయానికి వచ్చే దారిలో రాత్రి సమయాల్లో విశ్రాంతి గదులు లేక, పందుల వ్యర్థాల మధ్య దుర్భర పరిస్థితుల్లో గడుపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

అవి నిజమే అయితే, భక్తులను గులాగ్‌ (ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో కొనసాగిన నిర్బంధ కార్మిక శిబిరాలు)లు మాదిరిగా చూడటం తగదని కేరళ ప్రభుత్వం తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఆలయానికి వచ్చే బాలికలు, వృద్ధులతో కేరళ పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆహారం, నీరు, ఆశ్రయం, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కల్పించడం లేదు’ అని పేర్కొన్నారు.

వారంతా కర సేవకులే: సీఎం విజయన్‌
కరసేవకులను పంపించి ఆలయాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, భక్తులను ఇబ్బందులకు గురి చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నిస్తోందని సీఎం విజయన్‌ అన్నారు. పోలీసులు ఆదివారం రాత్రి ఆలయ పరిసరాల్లో ఉన్న 69 మంది వ్యక్తులను అరెస్టు చేయటాన్ని ఆయన సమర్థించుకున్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వీరు ఆలయాన్ని అధీనంలోకి తెచ్చుకునే పథకంలో భాగంగానే సన్నిధానం వద్ద ఉన్నారు.

పోలీసు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు అడవి బాటలో అక్కడికి చేరుకుని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు. 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడమే వీరి ఉద్దేశం’ అని వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయనీయకుండా అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీపైనా ఆయన మండిపడ్డారు. శబరిమల అంశంలో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకమయ్యాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు