బీఫ్‌ ప్రకటనపై బీజేపీ, వీహెచ్‌పీ ఫైర్‌..

17 Jan, 2020 17:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మకర సంక్రాంతి సందర్భంగా బీఫ్‌ డిష్‌పై కేరళ టూరిజం వివాదాస్పద ప్రకటనపై బీజేపీ, వీహెచ్‌పీలు భగ్గుమన్నాయి. ‘సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి ముక్కలు మరియు కరివేపాకులతో కొద్దిగా కాల్చిన గొడ్డు మాంసం ముక్కలు... అత్యంత క్లాసిక్ డిష్, బీఫ్ ఉలార్తియాతు’  అంటూ ఈనెల 15న కేరళ టూరిజం ట్విటర్‌లో ఓ ప్రకటనను పొందుపరిచింది. గోవులను పూజించే వారి మనోభావాలను గాయపరిచేలా ఈ ప్రకటన ఉందని వీహెచ్‌పీ నేత వినోద్‌ బన్సల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేరళ ప్రభుత్వంపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేరళ ట్విటర్‌ ప్రకటన ఆక్షేపించేలా ఉందని కేరళ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని బన్సల్‌ కోరారు. ఇక కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం రాష్ట్రంలోని హిందువులపై యుద్ధం ప్రకటించిందని ఎంపీ, బీజేపీ నేత శోభా కరంద్లాజే ఆరోపించారు. మకర సంక్రాంతి నాడు బీఫ్‌పై ప్రకటనతో కేరళ ప్రభుత్వం హిందువల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా కేరళలో ఆహారాన్ని ఏ ఒక్కరూ మతంతో ముడిపెట్టరని కేరళ టూరిజం మంత్రి కే సురేంద్రన్‌ స్పష్టం చేశారు. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయాలని ప్రభుత్వం భావించడం లేదని అన్నారు.  ఆహారంలోనూ మతాన్ని వెతికే వారే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. పంది మాంసంతో కూడిన ఆహారాన్ని కూడా ఉంచాలని వాటి చిత్రాలను కూడా పోస్ట్‌ చేయాలని కోరుతున్న వారు అలాంటి సమాచారం కూడా వెబ్‌సైట్‌లో ఉందని, వారు వాటిని చూడకపోయి ఉండవచ్చని మంత్రి పేర్కొన్నారు.

చదవండి : ‘కుక్క మాంసం తినండి.. ఆరోగ్యంగా ఉండండి’

మరిన్ని వార్తలు