వారంతా ప్రేమికులు కాదు..

15 Jul, 2018 16:36 IST|Sakshi

సాక్షి, ముంబై : అదృశ్యమైన మైనర్‌ బాలికలంతా సినిమాల్లో చూపినట్టు ప్రేమికులతో పారిపోయారని పోలీసులు  ఊహించుకోవడం విరమించాలని బాంబే హైకోర్టు పేర్కొంది. గత ఏడాది థానే నుంచి అదృశ్యమైన మైనర్‌ బాలిక ఆచూకీని పసిగట్టడంలో విఫలమైన మహారాష్ట్ర పోలీసులపై హైకోర్టు విరుచుకుపడింది. మైనర్‌ బాలికల అదృశ్యం కేసుల్లో పోలీసుల పనితీరు, వ్యవహార శైలిని జస్టిస్‌ ధర్మాధికారి, జస్టిస్‌ భారతి డాంగ్రేలతో కూడిన బెంచ్‌ తప్పుపట్టింది.

ఆయా కేసుల్లో బాలిక తల్లితండ్రులు ఎంతగా మధనపడుతుంటారో మానవతా దృక్పథంతో అర్ధం చేసుకోవాలని బాధిత బాలిక తండ్రి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు పేర్కొంది. పిటిషనర్‌ కుమార్తె ఆచూకీని త్వరితగతిన పసిగట్టాలని ఆదేశించింది. బాలిక తన స్కూల్‌లో సీనియర్‌ విద్యార్థితో కలిసి వెళ్లిందని, వారు తరచూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారని, బాలుడి తల్లితం‍డ్రుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని అదనపు పబ్లిక్‌ ప్రాసక్యూటర్‌ నివేదిక సమర్పించారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనర్లయిన వారిద్దరూ వేరొకరి సహకారం లేకుండా ఇంతకాలం ఎలా కలిసి ఉన్నారని, వారు నివసించేందుకు, తరచూ పలు ప్రాంతాలు వెళ్లేందుకు వారికి డబ్బులు ఎలా సమకూరాయి..? బంధువులు, బాలుడి తల్లితండ్రుల సహకారం లేకుండా ఇది జరిగే పనేనా అంటూ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

బాలుడి తల్లితండ్రులు అబద్ధం చెబుతున్నారని ఎందుకు అనుమానించలేదని ప్రశ్నించింది. కేసుపై తాజా పురోగతిని వివరిస్తూ రెండు వారాల్లోగా మరో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 

మరిన్ని వార్తలు