బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

28 Dec, 2018 20:36 IST|Sakshi
సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ (ఫైల్‌)

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకున్న హింసాకాండపై బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్‌ లోధి మరో వివాదం లేవనెత్తారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించి సరికొత్త వివాదం రేపారు. డిసెంబర్‌ 3న జరిగిన విధ్వంసకాండ సందర్భంగా బుల్లెట్‌ గాయంతో సుబోధ్ మరణించారు. ‘జనమంతా చుట్టుముట్టినప్పుడు సుబోధ్‌ సింగ్‌ నిస్సహాయంగా ఉన్నారు. ఆందోళనకారుల బారి నుంచి కాపాడుకునేందుకు తనను తాను కాల్చుకోవాలనుకున్నారు. చివరికి తుపాకిని తలకు గురిపెట్టి కాల్చుకున్నార’ని దేవేంద్ర సింగ్‌ అన్నారు. సుబోధ్ పుర్రెలో బుల్లెట్‌ ఉందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఆరు చోట్ల రాళ్లతో కొట్టిన గాయాలు ఉన్నట్టు కూడా పేర్కొంది. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’)

మహావ్‌ గ్రామంలోని ఓ చెరుకుతోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదం​ మొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్‌ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్‌ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్‌ కుమార్‌, సుమిత్‌ కుమార్‌ అనే యువకుడు మృతి చెందారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్‌ దల్‌ నాయకుడు యోగేష్‌ రాజ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, కీలక నిందితుడు ప్రశాంత్‌ నాథ్‌ను అరెస్ట్‌ చేసినట్టు యూపీ పోలీసులు గురువారం ప్రకటించారు. సుబోధ్‌ సింగ్‌ను కాల్చినట్టు అతడు ఒప్పుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే తాను కాల్చలేదని కోర్టు బయట మీడియాతో ప్రశాంత్‌ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు