రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు...

10 Oct, 2018 11:06 IST|Sakshi
మైనింగ్‌లో దొరికిన వజ్రాన్ని చూపిస్తున్న మోతీలాల్‌ ప్రజాపతి

భోపాల్‌ : అదృష్టం అంటే ఈ పేద రైతుదే. నిన్నటి వరకూ ‘ఈ రోజు ఎలా గడుస్తుందిరా దేవుడా..!’ అనుకున్న అతడు ఒక్క రాత్రిలోనే అపర కుబేరుడు అయ్యాడు. తాతల కాలం నుంచి చేస్తోన్న మైనింగ్‌ వ్యాపారం కలిసి వచ్చి అదృష్టం ‘వజ్రం’ రూపంలో తలుపు తట్టింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన మోతీలాల్‌ ప్రజాపతి కుటుంబం తరతరాలుగా భూమిని లీజుకు తీసుకుని మైనింగ్‌ జరుపుతుండే వారు. మోతీలాల్‌ కూడా ఇదే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల సెప్టెంబర్‌లో క్రిష్ణ కల్యాణ్‌పూర్‌ ప్రాంతంలో 25 గజాల భూమిని లీజుకు తీసుకుని మైనింగ్‌ చేస్తున్నారు. నెల తిరిగిలోపే అదృష్టం మోతీలాల్‌ తలుపు తట్టింది. మైనింగ్‌ చేస్తుండగా 42.59 క్యారెట్‌ బరువున్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేశారు.

ఈ విషయం గురించి మోతీలాల్‌.. ‘మూడు తరాల నుంచి మా కుటుంబం మైనింగ్‌లోనే ఉంది. కానీ ఎప్పుడు లాభాలు రాలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు  అదృష్టం నా ఇంటి తలుపు తట్టింది. ఈ వజ్రాన్ని అమ్మడం వల్ల వచ్చిన సొమ్ముతో నా పిల్లలని బాగా చదివించుకుంటాను. ఇల్లు కట్టుకుంటాను.. నా సోదరుని కూతుళ్లకు వివాహం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో ఎన్నికలు ముగిసిన తరువాత ఈ వజ్రాన్ని వేలం వేస్తాము. వచ్చిన సొమ్ములో 11 శాతం సొమ్మును ట్యాక్స్‌ కింద కట్‌ చేసి మిగతా డబ్బును మోతీలాల్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు