2019 నాటికే చేతులెత్తేస్తుందా?

11 Mar, 2017 19:42 IST|Sakshi
సత్తా చాటే సమయం లేదిక..!
  • లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో అగ్నిపరీక్ష..!
  • కాంగ్రెస్‌కు కానరాని శుభ శకునాలు
  • గుజరాత్, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లోనూ కష్టాలే?
  • సాక్షి, న్యూఢిల్లీ : శతాబ్దానికి పైగా చరిత కలిగిన కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో పోయిందేమీ లేదు. ఉత్తరాఖండ్‌లో పట్టు జారి పోయినా.. పంజాబ్‌ పగ్గాలు చేతికొచ్చాయి. గోవా, మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలోకి వచ్చింది. అయినా ఆ పార్టీలో ఉత్సాహం లేదు. మరో రెండేళ్లలో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు. వాటిని ఎదుర్కోవాలంటే ఆలోపు వచ్చే శాసన సభల ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చూపాలి. లేదంటే మళ్లీ చతికిలిపడాల్సిందే. కాంగ్రెస్‌లో ఇదే కలవరం. ఒకవైపు కమలం పార్టీ ప్రతి ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తుంటే ప్రతిసారి కాంగ్రెస్‌ పార్టీకి బలహీనతే బయటపడుతూ వస్తోంది.

    2013లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ ఎన్నికల నాటి నుంచి దాదాపు అన్ని ఎన్నికల్లో కుదేలవుతూ వస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌.. ఇలా వరుసగా రాష్ట్రాలన్నింటిలోనూ చతికిల పడుతూ వచ్చింది. బిహార్‌లో కొన్ని సీట్లు దక్కించుకుని అధికార కూటమిలో చేరింది. ఉత్తర ప్రదేశ్‌లో ఇదే తరహాలో వ్యూహాన్ని అమలుపరిచినా.. ఫలించలేదు. ఎట్టకేలకు పంజాబ్‌ను దక్కించుకుని ఒకింత పరువు నిలబెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్‌ దాని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. పార్టీని పటిష్టం చేయలేదు. క్షేత్రస్థాయి ప్రజాందోళనలకు నాయకత్వం వహించే స్థితిలో కూడా లేదు. వచ్చే రెండేళ్లలో ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు సానుకూల సమాధానం కనిపించడం లేదు.

    ముందున్నదీ ముళ్ల బాటే...
    తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది.. 2004 నుంచి పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీకి నరేంద్ర మోదీ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. 2019లో మరోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తే అంతకుముందే పలు కీలక రాష్ట్రాల్లో అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే మరో పది రాష్ట్రాల శాసన సభలకు గడువు తీరుతుంది. ముందుగా ఈ ఏడాది చివరలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    తదుపరి వచ్చే ఏడాది మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండింటిలో గుజరాత్‌ను ఆశించడం కాంగ్రెస్‌ సాహసమే అవుతుంది. ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికే అనేక వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బిందువై ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ తదుపరి 2018 నవంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాలు సాధిస్తూ వస్తోంది. రాజస్థాన్‌లో అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ప్రత్నామ్నాయంగా కాంగ్రెస్‌ గట్టి శక్తిగా నిలబడలేకపోతోంది.

    ఇక హిమాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర తదితర చిన్న రాష్ట్రాల్లో కూడా 2019 సార్వత్రిక ఎన్నికల్లోపే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటి ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై అంతగా ఉండకపోయినా.. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఉన్న నిరుత్సాహంతో ఈ రాష్ట్రాల్లో బీజేపీని ఎదురొడ్డి నిలవడం కష్టమే. 2019లో దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలంటే ఈ సమయం సరిపోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    ప్రాంతీయ నాయకత్వ లేమి..!
    బీజేపీ విజయాల వెనక నరేంద్రమోదీ, అమిత్‌షాల మాయాజాలం, సామాజిక సమీకరణాలు, అభివృద్ధి ఎజెండా ఉన్నా... ప్రాంతీయ నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించింది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్, వసుంధర రాజే, రమణ్‌ సింగ్, శర్వానంద సోనోవాల్‌ ఈ కోవలోని వారే. కానీ కాంగ్రెస్‌లో నెహ్రూ, గాంధీ కుటుంబం చరిష్మా మినహా ప్రాంతీయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగే వారు కరవయ్యారు. పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ చరిష్మా పార్టీకి అదనపు బలమైంది.

    గతంలో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నాయకులు బలంగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ సమయం మాత్రమే ఉన్నందున 2019 నాటికే చేతులెత్తేస్తుందా? లేక కదనోత్సాహంతో ఎదుర్కొంటుందా అని వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు