ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ

11 Feb, 2019 03:33 IST|Sakshi

కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌– ఎంపీ కునాల్‌పై ప్రశ్నల వర్షం

రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ  

షిల్లాంగ్‌: శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫంట్‌ కేసుల్లో కోల్‌కతా కమిషనర్‌ రాజీవ్‌కుమార్, టీఎంసీ ఎంపీ కునాల్‌ ఘోష్‌లను సీబీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా విచారించారు. తొలుత వీరిని వేర్వేరు గదుల్లో విచారించిన అధికారులు, ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంపై విచారణకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు రాజీవ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆయన యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శారదా కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు ఇద్దరు సీబీఐ అధికారుల బృందం రాజీవ్‌కుమార్, కునాల్‌ ఘోష్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 
వీడియో రికార్డింగ్‌కు సీబీఐ నో.. 
ఈ విషయమై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజీవ్‌ కుమార్‌ను రెండో రోజు విచారించామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి ముగిసిందన్నారు. తన విచారణను వీడియో తీయాలన్న రాజీవ్‌కుమార్‌ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించిందని వెల్లడించారు. కస్టోడియల్‌ విచారణ సందర్భంగా మాత్రమే వీడియో రికార్డింగ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

మధ్యాహ్నం వరకూ రాజీవ్‌ కుమార్, ఘోష్‌ను వేర్వేరు గదుల్లో విచారించామనీ, ఆతర్వాత మాత్రం ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ సాగించామని పేర్కొన్నారు. మరోవైపు షిల్లాంగ్‌లోని సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కునాల్‌ ఘోష్‌ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కునాల్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్లు చేయదల్చుకోలేదు. మొదటినుంచి నేను సీబీఐ అధికారులకు సహకరిస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరయ్యా’ అని తెలిపారు. శారదా కుంభకోణానికి సంబంధించి 2013లో కునాల్‌ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కొద్దికాలానికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.  

మరిన్ని వార్తలు